ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
మిరప పంట క్షేత్రస్థాయి పరిశీలనపై సమగ్ర నివేదిక
ఒక్కో పువ్వులో 30 పురుగులు ఉన్నట్లు నిర్ధారణ
పూత రాలడం, పిందె కట్టకపోవడానికి కారణం ఇదే..
విచక్షణా రహితంగా పురుగు మందులు వాడుతున్నట్లు గుర్తింపు
వేప, కానుగ చెక్క వాడాలని రైతులకు సూచన
వరంగల్, డిసెంబర్ 22(నమస్తేతెలంగాణ) : వర్షాలతోనే మిరప పంటకు కొత్త రకం పూత తామర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. సమస్యను గుర్తించకుండా రైతులు విచక్షణా రహితంగా కొత్త రకం పురుగు మందులను పిచికారీ చేస్తున్నట్లు కూడా తేలింది. మిర్చికి తామర పురుగు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు సమస్యను బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ (ఐఐహెచ్ఆర్) దృష్టికి తీసుకెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు జిల్లాలో పర్యటించి పురుగు సోకిన పంటలను పరిశీలించారు. శాంపిల్స్ తీసుకెళ్లి ల్యాబుల్లో పరీక్షించి పూర్తి నివేదికను స్థానిక ఉద్యానశాఖ అధికారులకు పంపారు. తామర పురుగుతో పాటు ఇతర పురుగులు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నివేదికలో సూచనలు చేశారు.
రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి కొత్త రకం పూత తామర పురుగు, ఇతర సమస్యల అధ్యయానికి ఐఐహెచ్ఆర్ బెంగళూరు శాస్త్రవేత్తలు ఇటీవల జిల్లాలో పర్యటించారు. నర్సంపేట మండలం చంద్రయపల్లి, బాంజీపేట గ్రామాలను సందర్శించి మిరప పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీరిలో బెంగళూరుకు చెందిన కూరగాయలు, పంట రక్షణ, కీటక విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ కే మాధవిరెడ్డి, ఎం కృష్ణారెడ్డి, వీ శ్రీధర్, ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్త ఆర్ఆర్ రచన, పరిశోధన సంచాలకులు ఎం రాజ్‌కుమార్, విస్తరణ సంచాలకులు ఏ కిరణ్‌కుమార్, హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిశోధనా కేంద్రం కీటక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డీ అనితాకుమారి, ఉప ఉద్యాన సంచాలకులు కే వేణుగోపాల్, ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా శాస్త్రవేత్తల వెంట మిర ప పంటలను సందర్శించారు. రెండు గ్రామాల్లోని పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు రైతులతోనూ మాట్లాడారు. సమస్యలకు అనుగుణంగా చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై వారికి అవగాహన కల్పించారు. మిరప పంటలో కొ త్త రకం పూత తామర పురుగులు, ఇత ర రకాల పురుగులు, తెగుళ్లకు సంబంధించి నమూనాలు సేకరించారు. వీటిని తమ వెంట తీసుకెళ్లి ల్యాబుల్లో పరీక్షలు జరిపారు. తమ అధ్యయనం, పరీక్షల్లో తేలిన అంశాలపై బెంగళూరు శాస్త్రవేత్తలు, రాష్ట్ర ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు నివేదిక రూపొందించారు. కొత్త రకం పూత తామర పురుగుతో పాటు ఇతర పురుగులు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నివేదికలో సూచనలు చేశారు. దీన్ని ఇటీవల ఉద్యానశాఖ అధికారులకు పంపారు.
గుర్తించిన పురుగులు, తెగుళ్లు
నివేదిక ప్రకారం శాస్త్రవేత్తల బృందం మిరప పంటలో ఆశించిన పురుగులు, తెగుళ్లు, ఇతర సమస్యలను గుర్తించిం ది. మొదటిది కొత్త రకం పూత తామర పురుగు. మిరప పంటలో ఒక్కో పువ్వు లో 20 నుంచి 30 పూత తామర పురుగులు ఉన్నాయి. తామర పురుగుల వల్ల ఆకుపై ముడుత వచ్చింది. నల్లి పురుగులతో ఆకు కింది ముడుత తెగులు వ చ్చింది. ఆకు ముడుత, మోజాయిక్ వై రస్ తెగుళ్లు సోకాయి. కొమ్మ ఎండు తె గులు, కాయకుళ్లు తెగులు, సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్నాయి. మొక్కల పెరుగుదల కృశించింది. వడలు తెగులు ఆశించింది. చెట్లపై పిందెలు ఏర్పడడం లేదు. ఈ సమస్యలు, వాటి ఉధృతి కొ న్ని పంటల్లో అధికంగా, మరికొన్ని పం టల్లో తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రైతులతో మాట్లాడి గత నెల రోజుల క్రితం కురిసిన వర్షాల త ర్వాత నుంచి ఈ పూత తామర పురుగులను గమనించినట్లు నిర్ధారించారు. నెల రోజుల నుంచి పిందెలు కట్టడం లేదని, పూత తామర పురుగులు ఆశించడం వల్ల పూత అధికంగా రాలిపోతోందని తేల్చారు. సమస్య ఏమిటో గమనించకుండా రైతులు పురుగు, తెగుళ్ల మందులను ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి నిర్దేశిత మోతాదుకంటే ఎక్కువ మోతాదులో పిచికారీ చేస్తున్నట్లు కనుగొన్నారు. రైతులు విచక్షణా రహితంగా కొత్త రకం పురుగు మందులను, బైయోస్ వాడుతున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
వేప, కానుగ చెక్క వాడాలి..
కొత్త రకం పూత తామర, ఇతర పురుగులు, తెగుళ్ల నివారణకు మిరప పంటలో చేపట్టాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలు రైతులకు యాజమాన్య పద్ధతులను సూచించారు. అధికంగా నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలని, వేప, కానుగ చెక్క వాడాలని పేర్కొన్నారు. అధికంగా పురుగు మందుల వాడకం, బైయోస్, టానిక్ వంటివి పూర్తిగా ఆపాలని, గుర్తించిన సమస్యకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను చేపట్టాలని, ఎకరానికి 40 నుంచి 50 నీలి, పసుపు రంగు జిగురు అట్టలు అమర్చాలని సూచించారు. పురుగు మందుల పిచికారీలో కనీసం పది రోజుల వ్యవధి పాటించాలని, పూత తర్వాత ప్రతి పది నుంచి పదిహేను రోజుల వ్యవధితో 3 నుంచి 4 సార్లు సూక్ష్మ పోషక మిశ్రమాన్ని పిచికారీ చేయాలని నివేదికలో తెలిపారు. ముఖ్యంగా ఆకుపై ఆశించే పూత తామర పురుగులు, వైరస్ తెగుళ్లకు స్పినోసాద్, ఫిప్ప్రోనిల్, అసెటమప్రిడ్, సూక్ష్మ పోషక మిశ్రమం, క్లోరోఫైరిపాస్ మందులను నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి వేర్లు తడిచేలా పాదుల్లో పోయాలని, ఈ తెగులు సోకిన తోటల్లో పది రోజుల పాటు నీరు పెట్టడం నిలిపి వేయాలని తెలిపారు.