
నల్లగొండ, నవంబర్ 22 : యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్ల పంట రుణాలను రైతులకు ఇవ్వాలని నిర్ణయించనట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం డీసీసీబీ కార్యాలయంలో ఆయన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం పాలకవర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యాసంగి పంట రుణాల కోసం ప్రతి సొసైటీకి రూ.రెండు లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు దీర్ఘకాలిక రుణాలు రూ.95 కోట్లు మంజూరు చేశామని, ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.20 కోట్లు, మార్టిగేజ్ రుణాలు రూ.12 కోట్లు అందించినట్లు తెలిపారు. విద్యా రుణాలను 250 మందికి రూ.40 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా కేంద్ర బ్యాంకు ఏడాదిలోనే రూ.500 కోట్లకు పైగా టర్నోవర్ సా ధించి ప్రస్తుతం రూ.1500 కోట్ల టర్నోవర్‌తో ముందుకెళ్తున్నదని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ బ్యాంకు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 1నుంచి ప్రారంభమైన డిపాజిట్ల మహోత్సవానికి విశేష ఆదరణ వచ్చిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ సహకార బ్యాంకులపై దృష్టి పెట్టినందునే నేడు ఈ బ్యాంకులు ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, సీఈఓ మదన్ మోహన్, డైరెక్టర్లు పాశం సంపత్ రెడ్డి, సైదయ్య, అంజయ్య, రంగాచారి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.