ఏ కాలమైనా నంది నోట నీటి ధార
ఏడాదిపాటు పంటల సాగు
పచ్చటి వాతావరణంలో ఆలయ పరిసరాలు
శివరాత్రిని పురస్కరించుకుని రెండు రోజుల జాతర
ఆలయానికి గుర్తింపు తీసుకురావాలి : స్థానికులు
కొడంగల్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో ఏవిధంగా నంది నోట నీటిధార వస్తుం దో అదే తరహాలో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కస్తూర్పల్లి గ్రామంలోని లొంక బసవన్న పుణ్యక్షేత్రం అటువంటి మహాత్మ్యా న్ని చూపుతున్నది. మహానందిలో స్వచ్ఛమైన నీటిధార ఏరుగా పారుతూ పంటపొలాలకు చేరుతుంది. అదేవిధంగా బసవన్న ఆలయంలోని నంది నోట నుంచి స్వచ్ఛమైన నీరు ఏరుగా పారుతూ దాదాపు మూడు ఎకరాల ఆలయ భూములకు నీటిని అందిస్తున్నదని స్థానిక రైతులు చెబుతున్నారు. కాలాలతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా నీటిధార పారుతూనే ఉంటుందనీ, ఇం తటి విశిష్ఠత కలిగిన పుణ్యక్షేత్రానికి గుర్తింపు తీసుకు రావాలని స్థానికులు పేర్కొంటున్నారు. ఆలయ ప్రాంగణం ఎప్పు డూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది. లొంక బసవన్నను దర్శించుకొని ఆ ప్రదేశంలో కొద్దిసేపు గడిపితే మనస్సుకు ప్రశాంతత, భక్తి భావన కలుగుతుందని ప్రజల నమ్మకం.
ఎక్కడి నుంచి నీరు వస్తుందో ..
బసవన్న ఆలయంలోని నంది నోట నుంచి ప్రవహించే నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేకపోయారు. స్వచ్ఛమైన నీరు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. రెండేండ్ల క్రితం ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లోనూ నీరు ఇంకిపోకుండా పరిసర ప్రాంతాల రైతుల దాహాన్ని తీర్చిందని, నంది నోట నుంచి ప్రవహించే నీరు ఆ పరమశివుడు అనుగ్రహించిన ప్రసాదంగా భక్తులు భావించి, ఆ నీటిని తాగుతారు. భక్తులు తాగడానికే కాకుండా ఆలయ ప్రాంగణంలోని రెండు కొలనుల్లో ఏడాది పొడవునా నీరు సమృద్ధిగా ఉంటూ పరిసర ప్రాంత పొలాలకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ పంట పొలాల్లో ప్రతి ఏడా ది వరి పంటను సాగు చేస్తుంటారు.
ఆలయ ప్రదేశం..
ఈ పుణ్యక్షేత్రం కొండలు, గుట్టల మధ్య ఉంటుంది. కొడంగల్ నుంచి కస్తూర్పల్లి గ్రామానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కస్తూర్పల్లి నుంచి లొంక బసవన్న ఆలయానికి దూరం రెండు కిలోమీటర్లు. గ్రామం నుంచి ఆలయానికి వెళ్లే రోడ్డు అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రతి సోమవారం, ఆయా పర్వదినాల్లో ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు, భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏడాది మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆలయం వద్ద రెండు రోజులపాటు జాతర వైభవంగా జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో శ్రీరాముడి పాదాలు, శివలింగం, బసవన్న ఆలయాలతోపాటు చెట్టు కింద ఆంజనేయస్వా మి కొలువుదీరి ఉన్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో రెండు కొలనులు ఉన్నాయి.
ఒక కొలనులో నంది నోట నుంచి స్వచ్ఛమైన నీరు పారుతూ కొలను నిండుగా ఉంటుంది. నంది నోట నుంచి వస్తున్న ధారతో కొలను నిండగా మిగతా నీరు రెండో కొలనులోకి వెళ్తుంది. అక్కడి నుంచి పంటపొలాలకు చేరుతుంది. నంది నోట నీరు వస్తున్న కొలను మధ్యలో శివలింగం కొలువుదీరింది. ఈ శివలింగంపై, పానవట్టంపై పాము పారి ఆడుతున్నట్లు దర్శనమిస్తాయి. అక్కడ
చూడగానే భక్తిభావం పెంపొందుతుంది. నంది నోట నుంచి వచ్చే నీటిధార శ్రీరాముడి ఆలయంలోని పాదాల కింది నుంచి వస్తున్నట్లు గ్రామంలోని పెద్దలు పేర్కొంటున్నారు. గతంలో కొందరు నీటి ధార ఎక్కడి నుంచి వస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు తవ్వకాలు జరిపినా, పరిశోధనలు చేసినా జలధారను ఎవరూ గుర్తించలేకపోయారని స్థానికులు తెలిపారు. దీం తో ఆనాటి నుం చి గ్రామం, చుట్టుపక్కల గ్రామాలకు చెంభక్తుల్లో ఆలయ ప్రాంతంపై మరింత విశ్వాసం పెరిగింది.