ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ధ్యాన మహాసభలను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన సుభాష్ పత్రీజీ
కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
వివిధ ప్రాంతాల నుంచి హాజరైన పిరమిడ్ మాస్టర్లు, గురువులు, ధ్యానులు
కడ్తాల్, డిసెంబర్ 21 : మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలో గల కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో, మంగళవారం రాత్రి మహిళా ధ్యాన మహాచక్రాల సభలు-3 ఘనంగా ప్రారంభమయ్యాయి. పదకొండు రోజులపాటు నిర్వహించే ధ్యాన మహాచక్రాల సభలను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, పిరమిడ్ ట్రస్టు సభ్యులతో కలిసి బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. మహేశ్వర మహా పిరమిడ్‌ను కడ్తాల్‌లో నిర్మించడంతో, ఈ ప్రాంతానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పిరమిడ్‌ను ఏర్పాటు చేసిన బ్రహ్మర్షి పత్రీజీకి, ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. మహిళలను గౌరవిస్తే ప్రపంచమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. ధ్యాన సభలకు వచ్చేవారికి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
సుభాష్ పత్రీజీ మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ నిత్యం ధ్యాన సాధన చేయాలని తెలిపారు. ధ్యానం సర్వరోగ నివారిణి అని, మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ధ్యానం చేయడమే ఏకైక మార్గమని అన్నారు. కైలాసపురిలో నిర్మించిన మహేశ్వర మహా పిరమిడ్‌ను ప్రపంచానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ధ్యాన మహా సభలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ధ్యానులకు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ, నిర్వాహకులు పాసులు జారీ చేశారు. భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, సభ్యులు శివప్రసాద్, బాలకృష్ణ, హనుమంతరాజు, సాంబశివరావు, లక్ష్మి, జయశ్రీ, సౌమ్యకృష్ణ, శ్రీరాంగోపాల్, ప్రేమయ్య, దామోదర్‌రెడ్డి, రాంబాబు, మాధవి, రవిశాస్త్రి, సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ శంకర్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.