
నమస్తే కథనం చూసి ముందుకొచ్చిన దాతలు
ఫస్ట్ టర్మ్ ఫీజు అందించిన కస్తూరి ఫౌండేషన్
రెండో టర్మ్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్
ఎన్బీఆర్ ఫౌండేషన్‌తోపాటు సాయానికి మరికొంత మంది..
నమస్తే తెలంగాణ చొరవతో పేదింటి ఆడపిల్లల ఉన్నత విద్యకు బాటలు
నల్లగొండ, నవంబర్ 21 : జేఈఈ 2021లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి జాతీయ స్థాయి కాలేజీల్లో సీట్లు దక్కించుకున్నా చేరేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న గిరిజన విద్యార్థినుల సాయానికి పలువురు దాతలు ముందుకు వచ్చారు. ఆదివారం నమస్తే తెలంగాణ మినీలో ప్రచురితమైన ‘చదువుకుంటాం సాయం చేయండి’ కథనానికి విశేష స్పందన వచ్చింది. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ఐదుగురు విద్యార్థినులకు ఫస్ట్ టర్మ్ ఫీజు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఆదివారం నల్లగొండలోని నమస్తే తెలంగాణ టౌన్ కార్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో చెక్కులతో పాటు నోటు పుస్తకాలు అందించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ రెండో టర్మ్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు కుమారుడు సిద్ధార్థ ఎన్బీఆర్ ఫౌండేషన్ ద్వారా దామరచర్లకు చెందిన కర్ర పూజిత చదువు బాధ్యత తీసుకుంటానని.. దామరచర్ల వార్డు సభ్యుడు పూజితకు రూ.50వేలు ఇస్తానని ప్రకటించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు రమేశ్ గిరిజన బిడ్డల చదువుకు సాయం చేస్తానని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ ఐదుగురు విద్యార్థినులు.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేయడానికి రేయింబవళ్లు కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు మరో అడుగు మిగిలి ఉండగా ఆర్థిక ఇబ్బందులు వారికి అడ్డుగోడలుగా నిలిచాయి. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ చొరవ తీసుకుని విద్యార్థినుల సమస్యను ప్రముఖంగా ప్రచురించింది. ‘చదువుకుంటాం.. సాయం చేయండి ప్లీజ్’ అనే శీర్షికతో విద్యార్థినుల సమస్యను వెలుగులోకి తెచ్చింది. దాంతో పలువురు దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం ప్రకటించారు. విద్యార్థినులను అభినందించి ‘నమస్తే తెలంగాణ’ చొరవను కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పేద విద్యార్థుల చదువు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఆరేండ్లుగా కృషి చేస్తున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ఐదుగురు విద్యార్థినుల ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించారు. ఆదివారం నమస్తే తెలంగాణ నల్లగొండ టౌన్ కార్యాలయంలో విద్యార్థినులు కొర్ర పూజిత, రమావత్ మమత, గుగులోతు భూమిక, ఇస్లావత్ శ్రావణి, ధనావత్ పావనికి వారి తల్లిదండ్రుల సమక్షంలో ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున లక్ష రూపాయల ఫీజు చెల్లించారు. అదేవిధంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ అందించి ర్యాంకులు సాధించినందుకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్‌తో పాటు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్ రెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ సైతం విద్యార్థినుల రెండో టర్మ్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన నగదును తీసుకువెళ్లమని సూచించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కుమారుడు సిద్ధార్థ ఎన్బీఆర్ ఫౌండేషన్ ద్వారా కొర్ర పూజిత చదువు బాధ్యత తీసుకున్నారు. పూజితకు రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తామని దామరచర్ల వార్డు సభ్యుడు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు రమేశ్ సైతం గిరిజన బిడ్డల చదువుకు కావాల్సిన సాయం చేస్తానని తెలిపారు.
నమస్తే తెలంగాణకు రుణపడి ఉంటాం
గుగులోతు భూమిక, బులాకితండా, చివ్వెంల(మం)
నాకు జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఐఐటీలోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సీటు వచ్చింది. కానీ అక్కడికి వెళ్లగలనా అని అనుకున్నా. నాలుగేండ్లు మా అమ్మా నాన్న కష్టం చేసి ఎలా చదివిస్తారు..! చదివించలేరు అనుకున్నా. మా ప్రిన్సిపాల్ వల్ల ‘నమస్తే తెలంగాణ’ పేపర్లో రాశారు. ఒక్క రోజులోనే మాకు ఇలా వచ్చి సాయం చేస్తారని అస్సులు అనుకోలేదు. ఇది నిజంగా ‘నమస్తే తెలంగాణ’ పుణ్యమే.
(సాయం చేయాలనుకునే వారు 574111610000030 అకౌంట్ నంబర్, లేదా 6300830959 సెల్ నంబర్లో సంప్రదించవచ్చు)