ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనాలు
ప్రజలతో మమేకమవుతున్న ప్రజాప్రతినిధులు
సత్ఫలితాలిస్తున్న హరితహారం
మర్పల్లి, డిసెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. పల్లెల్లో పచ్చదనంతోపాటు అడవుల శాతాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ పిలుపుతో ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకొని ప్రజలతో మమేకమై మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్నారు. ఏటా ప్రణాళికతో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నారు. వాటిని సంరక్షించేందుకు నిరంతరం నీరు అందించడంతోపాటు మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నారు..
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనాలు
మండలంలోని 27 గ్రామపంచాయతీల్లో 30 పల్లె ప్రకృతి వనాలకు 29 పూర్తి కాగా గుడ్లమర్పల్లి పల్లె ప్రకృతి వనం పెండింగ్లో ఉంది. దాదాపు రూ.55లక్షల 39 వేలతో ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు చేశారు. పల్లె ప్రకృతి వనాలను నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు వాటిని పార్కులుగా ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్, చిన్నారులు ఆడుకోవడానికి ఆటవస్తువులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. హరితహారంలో భాగంగా ఏడేండ్లుగా వేప కానుగ, చింత, జామ, మునగ, అల్లనేరేడు, తులసి తదితర మొక్కలతోపాటు పూలు, పండ్ల మొక్కలు నాటి పర్యావరణాన్ని సమతుల్యం చేస్తున్నారు. ప్రకృతి వనాల నిర్వహణను సర్పంచులు బాధ్యతగా భావించి చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామాల్లో పర్యటిస్తున్నాం : ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్
మండలంలోని 27 గ్రామపంచాయతీలతో పాటు రెండు అనుబంధ గ్రామాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయగా గుండ్లమర్పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పెండింగ్లో ఉంది. హరితహారంలో నాటిన మొక్కలను కాపాడుతున్నాం. పల్లె ప్రకృతి వనాలతో పాటు హరితహారం మొక్కలను ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం ప్రకారం అన్ని గ్రామాల్లో మొక్కలు నాటి పెంచుతున్నాం.