రంగారెడ్డి జిల్లాలో యాసంగిలో 7,500 ఎకరాల్లో పల్లి సాగు
గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన విస్తీర్ణం
షాబాద్, డిసెంబర్ 19: వరిని సాగు చేస్తే ఇబ్బందులు తప్పవని గుర్తించిన రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యాన్ని కొనబోమని చెప్పడంతో రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే వేరుశనగ(పల్లి) సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వానకాలం వరికోతలు పూర్తి చేసుకున్న రైతులంతా ఇప్పుడు పల్లిసాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రబీ పంటగా చాలా మంది రైతులు వేరుశనగను సాగు చేశారు. రంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్‌కుగాను ఇప్పటివరకు 7,500 ఎకరాల్లో వేరుశనగను సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి వరకు ఈ సాగు విస్తీర్ణం మరిం త పెరిగే అవకాశం ఉందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ఈ పంట సాగు జిల్లాలో గణనీయంగా పెరిగింది.
జిల్లాలో 7,500 ఎకరాల్లో సాగు..
రంగారెడ్డి జిల్లాలోని 26 మండలాల్లో ఈ ఏడాది యాసంగి సీజన్లో 7,500 ఎకరాల్లో రైతులు వేరుశనగను సాగు చేశారు. గతేడాది యాసంగిలో 2,500 ఎకరాల్లో మాత్రమే ఈ పంటను సాగు చేయగా, గతేడాది కంటే ఈ ఏడాది 5,000 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యాన్ని కొనబోమని చెప్పడం, రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని ప్రభుత్వం, అధికారులు గ్రామాల్లో సదస్సులు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సూచించడంతో చాలామంది రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం పెరిగింది.
అధిక దిగుబడి
నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. వాతావరణ పరిస్థితుల మేరకు విత్తనాలు వేసుకొని సస్యరక్షణ చేపడితే అధిక దిగుబడిని సాధించొచ్చు. వేరుశనగ విత్తే సమయంలో అం దుబాటులోకి వచ్చిన యంత్రాలను ఉపయోగిస్తే పెట్టుబడి ఖర్చులూ తగ్గుతాయి. రైతన్నకు పంటసాగులో ఖర్చులు తగ్గాలంటే మెళకువలు పాటించాలి. రైతులు తమకున్న కొద్దిపాటి పొలంలో ఈ పంటను సాగు చేసుకుంటే కూలీల ఖర్చు కూడా పెద్దగా ఉండదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం సూచించిన ప్రకారం ఆరుతడి పంటలైన పల్లితోపాటు పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, రాగులు, మినుములు, కుసుమలు, కూరగాయల పంటల సాగుపై దృష్టి సారిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
జిల్లాలో 7,500 ఎకరాల్లో సాగు..
రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో ఇప్పటివరకు 7,500 ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులుసాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి వరకు జిల్లాలో వేరు శనగ సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఈ పంటలో ఆర్జించొచ్చు.
వేరుశనగను సాగు చేస్తా
ఈ యాసంగిలో తనకున్న పొలంలో వేరుశనగను సాగు చేయా లని అనుకుంటున్నా. మా గ్రామంలో గతంలో వేరుశనగను సాగు చేసే వారు. గత మూడు, నాలుగేండ్లుగా వర్షాలు బాగా కురు వ డంతో వరి పంటను సాగు చేశా. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరిధాన్యాన్ని అక్కడే కొనుగోలు చేసి మద్దతు ధరను చెల్లించింది. ఈ యాసంగిలో ప్రభుత్వం వరి కి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని సూచిస్తుండటం తో వేరుశనగను సాగు చేస్తా.
-కుమ్మరిగూడ షాబాద్