రెండేండ్లకోసారి ఘనంగా తుల్జాభవానీ పూజలు
తండాల్లో ఘనంగా జరుగుతున్న వేడుకలు
బొంరాస్పేట, డిసెంబర్ 19 : భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో మతానికి, ఒక్కో కులానికి, జాతులకు ప్రత్యేకించి పండుగలు ఉన్నాయి. కొన్ని పండుగలు యావత్ దేశం అంతటా జరుపుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నాయి. మరికొన్ని పండుగలను వారి వారి ప్రాంతాలు, జాతులను బట్టి పండుగల పేర్లు మారుతుంటాయి. తెలంగాణలో అత్యధికంగా నివసించే గిరిజన తెగకు చెందిన లంబాడీలు జరుపుకునే దసరావ్ పండుగ వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే మొదటి మంగళవారం నుంచి 45 రోజులపాటు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ పండుగను జరుపుకుంటారు. వానకాలం పంటలు చేతికొచ్చే వేళ గిరిజనులు జరుపుకునే దసరావ్ పండుగపై నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.
పండుగ నిర్వహించే విధానం
బొంరాస్పేట మండలంలో సుమారు 70 గిరిజన తండాలున్నాయి. ఈ తండాల్లో ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే మొదటి మంగళవారం నుంచి పండుగ ప్రారంభమవుతుంది. ఒక తండాలో ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలు ఒకే రోజు పండుగ జరుపుకోవడం వీరి ప్రత్యేకత. కొందరు దసరావ్ పండుగకు ముందు పీర్లకు కందుర్లు కూడా చేస్తారు. ఆ తరువాత ఇంట్లో వెండితో తయారు చేసిన తుల్జా భవానీ మాత విగ్రహాన్ని తీసుకుని మహారాష్ట్రలోని తుల్జాపూర్కు వెళ్తారు. అక్కడి ఆలయంలో మేక పోతులను బలిచ్చి మొక్కు చెల్లించుకుంటారు. దసరావ్ పండుగ మంగళవారం మాత్రమే చేస్తారు కాబట్టి శనివారం తుల్జాపూర్కు వెళ్లి మంగళవారం ఉదయం నాటికి తండాకు చేరుకునేలా ప్రణాళిక వేసుకుంటారు. తుల్జాపూర్ నుంచి వచ్చే వరకు ప్రతి ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. తుల్జాపూర్ నుంచి వచ్చినవారు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందే కూర్చుంటారు. పురోహితులతో అమ్మవారి విగ్రహానికి పంచామృతంతో అభిషేకించిన తరువాత కుటుంబసభ్యులు విగ్రహాన్ని ఒక పాత్రలో ఉంచి తలపై పెట్టుకుని తెచ్చి మండపంలో ప్రతిష్ఠిస్తారు. అనంతరం నైవేద్యం సమర్పిస్తారు. మేకపోతులను బలిచ్చి మాంసం వండి కుంభం పోసి నైవేద్యంగా సమర్పిస్తారు. మంగళవారం రాత్రి అందరూ ఆరగిస్తారు. రాత్రంతా భక్తి పాటలు, నృత్యాల మధ్య జాగారం చేస్తారు. బుధవారం ఉదయం మళ్లీ అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు ముగిస్తారు. మంగళవారం ముందు సోమవారం రోజు ఆంజనేయస్వామిని కూడా గిరిజనులు పూజిస్తారు. స్వామి చిత్రపటాలను ఉంచి మాలిజను నైవేద్యంగా సమర్పిస్తారు. తండాలలో పశువులు, మేకలు, గొర్రెలు ఏడాదంతా మంచిగా ఉండాలని మంగళవారం ఉదయం మంత్రాల్ పూజను నిర్వహిస్తారు.
కొత్తగా సంసారం పెడితే మూడేండ్లు వరుసగా పండుగ చేయాలి
ఉమ్మడి కుటుంబంలో ఉండి ఎవరైనా విడిపోయి కొత్తగా సంసారం పెడితే వారు వరుసగా మూడేండ్లు ఈ పండుగ చేయడం లంబాడీల్లో ఆచారం. ఆ తరువాత అందరిలా రెండేండ్లకోసారి చేయాలి. దసరావ్ పండుగ చేయడానికి ఒక్కో కుటుంబానికి రూ.50వేల నుంచి రూ.70వేల దాకా ఖర్చు వస్తుంది. ఒక్కో కుటుంబంలో మొక్కును బట్టి మూడు నుంచి ఐదు మేకపోతుల దాకా కోస్తారు. తుల్జా భవానీ మాతకు మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని లంబాడీల ప్రగాఢ విశ్వాసం.