క్యాంప్ కార్యాలయంలో విలేకరుల
సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల టౌన్, డిసెంబర్ 19 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఆదివారం సాయంత్రం చేవెళ్లలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యాదయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి జరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేశానని, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే టికెట్ కోసం 20 సంవత్సరాలు పాటుకష్ట పడ్డానని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు గెలిచిన అనంతరం సంపాదించుకోవడం తప్పా ప్రజలకు సేవ చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు గతాన్ని గుర్తు చేసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలని, అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, 111 జీవో రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని గుర్తు చేశారు. త్వరలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి నీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదన్నారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ప్రగల్బాలు పలికితే ప్రయోజనం లేదని, మీరు ఏ పార్టీలోకి వెళ్తారో మీకే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరకుండా అడ్డుకునే కుట్ర చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధికి బాటలు వేశామన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, చెత్త సేకరణకు ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ ఘని, టీఆర్ఎస్ నాయకులు సాయికుమార్ పాల్గొన్నారు.