డ్రైనేజీ నిర్మాణానికి రూ.20కోట్లు కేటాయింపు
భవిష్యత్తులో ముంపు సమస్య రాకుండా చర్యలు
పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి
జిల్లెలగూడలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, డిసెంబర్ 19 : జిల్లెలగూడ జీహెచ్ఎంసీ సరిహద్దులో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ నిధుల నుంచి రూ.20 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మీర్‌పేట మున్సిపల్ పరిధిలోని శ్రీధర్ కాలనీలో పర్యటించారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్మశాన వాటిక, పెద్ద చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా కాలనీలను అభివృద్ధి చేయాలన్నారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా నీటి సమస్య, డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి పాత పైపులైన్ స్థానంలో కొత్త పైపులైన్స్ వేస్తారన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి చొరవ తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. డ్రైనేజీ పైపులైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. కాలనీలలో మురుగు సమస్య లేకుండా చూడాలని మంత్రి సూచించారు.