ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్, డిసెంబర్ 18 : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడం వల్లే రైతులకు ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా వినూత్న పథకాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు బంధు ఆగదని, రైతులను కేసీఆర్ నుంచి వేరు చేయాలనే కుట్రతో ప్రతిపక్షాలు రైతుబంధుపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతున్నదని స్పష్టం చేశారు. గతంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువులను కొనుగోలు చేసేందుకు చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాయాల్సి వచ్చేదని, కరెంటు లేక పంటలు పండక రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన పాలన కొనసాగినట్లు తెలిపారు. నేడు అటువంటి పరిస్థితులకు భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ 24 గంటల నిరంతర విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతోపాటు అన్ని కాలాల్లో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతు అభివృద్ధిని ఓర్వలేని కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు యాసంగి వడ్ల కొనుగోలుపై కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. కేంద్ర నాయకులు యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని చెపుతుంటే.. బండి సంజయ్ వడ్లను కొంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, స్పష్టత లేకుండా మాట్లాడుతున్నట్లు తెలిపారు. యాసంగి వడ్లను మోదీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ నెల 20న గ్రామగ్రామాన చావుడప్పులతో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రులు ధర్నా చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవన్నారు. ఇప్పుడిప్పుడే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, యాసంగిలో వరి పంటను పండించి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు.
కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్‌పేట పీఏసీఎస్ అధ్యక్షులు శివకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బస్వరాజ్, బొంరాస్‌పేట జడ్పీటీసీ అరు ణాదేశు, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, అధికార ప్రతినిధి రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌బాబు, సర్పంచ్‌లు అంజద్, ఫకీరప్ప, నాయకులు సాయిలు, డా.నవాజొద్దీన్, దత్తురెడ్డి, బాల్‌రాజ్, ఫయూమ్ ఉన్నారు.