పెద్దేముల్, డిసెంబర్ 15: సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలకు అధికారులు పరిష్కార మార్గాలు వెతకాలని ఎంపీపీ టి.అనురాధరమేశ్ అ న్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఎంపీపీ అనురాధ రమేశ్ , జడ్పీటీసీ ధారాసింగ్,కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ ఎంపీపీ మధులత మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యను అధికారులు నోట్ చేసుకొని తదుపరి సమావేశం వరకు విధిగా పరిష్కరించాలన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకం ద్వారా అందుతున్న డబ్బులు రైతులకు చేరే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశానికి హాజరుకానీ ఆర్అండ్బీ, పశుసంవర్ధక శాఖ అధి కారులకు నోటీసులు జారీ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.అధికారులు సమన్వయంతో ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతి సమస్యను పరి ష్కరించి గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌ను, మండలానికి నూతనంగా బదిలీపై వచ్చిన ఐసీడీఎస్ సూపర్వైజర్ దశమ్మను,ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళిన యాదమ్మను సన్మానించారు.కార్యక్రమం లో ఎంపీడీవో లక్ష్మప్ప, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ధన్సింగ్ పాల్గొన్నారు.
మండలానికి రూ. 40 లక్షలు మంజూరు
పెద్దేముల్, డిసెంబర్ 15 : గ్రామాల అభివృద్ధియే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మండల ఎంపీపీ టి.అనురాధ రమేశ్ అన్నారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్లో మండల కోఅప్షన్ సభ్యుడితో కలుపుకొని సుమారు 13 మంది ఎంపీటీసీలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున వివిధ రకాల పనుల ప్రోసిడింగ్లను వైస్ ఎంపీపీ మధులత,జడ్పీటీసీ ధారాసింగ్లతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులలో భాగంగా పెద్దేముల్ మండలానికి రూ.40 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. అందులో మొత్తం 13 మంది ఎంపీటీసీలతోపాటు, కోఆఫ్షన్ సభ్యుడికి ఒక్కొక్కరికి సుమారు రూ.2 లక్షల రూపాయల విలువ చేసే వివిధ రకాల పనులను ప్రోసీడింగ్లను అందజేయడం సంతోషంగా ఉందన్నారు.మిగతా నిధులను మండలంలోని ఏ గ్రామాల్లోనైనా అత్యవసరంగా అవసరమున్న చోట కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.