
మెదక్, నవంబర్ 15 : రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం వరి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, లారీల సంఖ్యను పెంచడంతోపాటు ట్రాక్టర్ ద్వారా ధాన్యం తరలించేందుకు అనుమతించామన్నారు. రైస్ మిల్లుల్లో కూడా హమాలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ధాన్యం లోడ్ దించిన వెంటనే ట్రక్‌షీట్ ఇచ్చేలా చూస్తున్నామని, ట్యాబ్ ఎంట్రీలు కూడా చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 358 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 14,854 రైతుల నుంచి రూ.141.40 కోట్ల విలువైన 72,144 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని తెలిపారు. అనంతరం మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, కేంద్రం ఇన్చార్జిలు, రైస్‌మిల్లర్లతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ఎంట్రీల్లో వస్తున్న సాంకేతిక సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరాం, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయాధికారులు, రైస్ మిల్లుల యజమానులు, పీఏసీఎస్ అధ్యక్షులు, కేంద్రం ఇన్చార్జిలు పాల్గొన్నారు.