నాణ్యతకు, రుచికి పెట్టింది పేరు తాండూరు కందిపప్పు
ఇప్పటికే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ జారీ
ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి
జీఐ ఐడెంటిఫికేషన్ కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తాండూరు, నవంబర్ 13 : కందిపప్పు అంటేనే గుర్తుకువచ్చేది తాండూరు. నాణ్యతకు, రుచికి పెట్టింది పేరు. ఆ ఊరి పేరే ఓ బ్రాండ్‌గా నిలిచింది. ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. తెలంగాణవ్యాప్తంగానే కాకుండా దేశంలోని పలు రాష్ర్టాలతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నది. హైదరాబాద్ తదితర నగరాల్లో తాండూరు బ్రాండ్ పేరిట కందిపప్పు క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తాండూరు కందిపప్పుకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నది. కందిపప్పుకు గుర్తింపు వస్తే ఈ పంట సాగు చేస్తున్న రైతులకు మంచి రోజులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని శాస్త్రవేత్తలు, వ్యాపారులు పేర్కొంటున్నారు.
తాండూరు కందిపప్పు ప్రత్యేకత..
వికారాబాద్ జిల్లా తాండూరు డివిజన్లో కంది పంట సాగు అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్నది. మంచి రుచితోపాటు నాణ్యత ఉండడంతో తాండూరులో తయారైన కందిపప్పుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ కందిపప్పు త్వరగా ఉడికే గుణంతోపాటు ఎక్కువ సమయం నిలువ ఉండే లక్షణం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం కోసం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి ‘తాండూరు బ్రాండ్‌గా ఆర్గానిక్ కందిపప్పు’ను తయారు చేసి అమ్మకాలు జరిపేందుకు గత ఏడాది నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్లు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూ.3 లక్షలతో కందిపప్పు తయారీ మిషన్‌ను తీసుకువచ్చారు. రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా పండించిన పంటతో వందకు వంద శాతం నాణ్యమైన ఎలాంటి కల్తీలేని కందిపప్పును మార్కెటింగ్ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. నేరుగా బయట మార్కెట్లో అమ్మకాలు జరిపేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి తాండూరు కందిపప్పుకు లైసెన్స్ కూడా లభించింది. 2020 జూన్ 2న సీఎం కేసీఆర్ తాండూరులో పండించిన ఆర్గానిక్ కందిపప్పు విక్రయాలను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేశారు.
జీఐ గుర్తింపు విధానం..
ప్రపంచ వాణిజ్య సంస్థలోని సభ్య దేశాలు తమ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆహార ఉత్పత్తులు, చేనేత కళలు, వస్తువులు, వంటలకు భౌగోళిక గుర్తింపు (జియోలాజికల్ ఐడెంటిఫికేషన్) తీసుకు వచ్చేందుకు ముసాయిదా తీర్మానాలు చేస్తున్నాయి. మొదట దీని కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పరిశీలన, అభ్యంతరాలు, పూర్తి విచారణ తరువాత జీఐ జర్నల్ ముద్రిస్తారు. అనంతరం జీఐ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 6 నెలల నుంచి 12 నెలల సమయం పడుతుంది. భౌగోళిక గుర్తింపు పొందిన సంస్థలు, వ్యక్తులు మాత్రమే జీఐ పేరును వినియోగించాల్సి ఉంటుంది. ఇతరులు వినియోగిస్తే సివిల్, క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. మన దేశంలో జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం చెన్నైలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాండూరు కందిపప్పుకు జీఐ గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నది.