ఎంపీడీవోలతో వికారాబాద్ కలెక్టర్ నిఖిల వీడియో కాన్ఫరెన్స్
పరిగి, జనవరి 12 : రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుంచి కల్లాల నిర్మాణం, వైకుంఠధామాల నిర్మాణం, వాటి చెల్లింపులు తదితర అంశాలపై ఎంపీడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తమ పొలాల వద్ద కల్లాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే రైతుల జాబితాను అందజేయాల్సిందిగా సూచించారు. అన్ని మండలాల్లో కల్లాల నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ నెల 31 వరకు వందశాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. పనుల్లో పురోగతి లేక వెనుకబడిన మండలాల అధికారులు పండుగ సెలవుల్లోనూ పనిచేసి పనులను వంద శాతం పూర్తి చేయించాలని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టిన వైకుంఠధామాలకు సంబంధించిన ఎఫ్టీవోలు నేటికీ అప్లోడ్ చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అసంపూర్తి పనులు మంగళవారం వరకు పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. వెంటనే కాంట్రాక్టర్లకు డబ్బులందేలా ఎఫ్టీవోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని చెప్పారు. ప్రత్యేక టీమ్లు ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. పనులు పూర్తయ్యే వరకు విస్తృతంగా సమీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పనులు పెండింగ్లో ఉంటే ఎవరికీ సెలవులు మంజూరు చేయబడవని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో మల్లారెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి అనిత పాల్గొన్నారు.