
కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 11:జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) ఎంతోమంది ఉపాధికి బాటలు వేస్తున్నది. నిరుద్యోగ యువతీ, యువకుల భవితకు దిక్సూచిగా నిలుస్తున్నది. ప్రైవేట్‌రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తూ.. బతుకుపై భరోసా కల్పిస్తున్నది. ముఖ్యంగా గ్రామీణ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ కోర్సుల ప్రాధాన్యం వివరిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నది. వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరింపజేస్తున్నది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం), స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (ఎస్సీఏ) ద్వారా జాబ్‌మేళాలు నిర్వహిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. మారుమూల ఏజెన్సీ నిరుద్యోగులు నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నది. కేవలం భద్రాద్రి జిల్లాలోనే డీఆర్డీఏ సుమారు 2,200 మందికి పైగా ఉద్యోగాలు కల్పించింది.
ప్రైవేటు రంగంలో యువతకు విస్తృతంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర బిందువుగా నిలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ. కేవలం ఈ ఒక్క జిల్లాలోనే సుమారు 2,200 మందికి పైగా ఎంప్లాయిమెంట్ కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ విద్యనభ్యసించి ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతీయువకులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ కోర్సుల ప్రాధాన్యం గురించి వివరిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఉద్యోగవకాశాలు కల్పించి జీవితంలో స్థిరపడేలా చేస్తోంది. మారుమూల ఏజెన్సీ నిరుద్యోగ యువతీ యువకులు సైతం పట్టణ, జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యో+-6+++++++గాలు చేసేలా కృషి చేస్తోంది.
2,200 మందికి కొలువులు
భద్రాద్రి జిల్లా ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్లలో వివిధ సెంటర్లలో కంప్యూటర్స్, ల్యాండ్ సర్వే, బ్యుటీషీయన్, ఎలక్ట్రీషియన్, ఫార్మసీ తదితర కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. 2018-19 నుంచి ఇప్పటి వరకూ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన్ (డీడీయూ-జీకేయూ) ద్వారా 1,101 మందికి శిక్షణ ఇచ్చింది. ఆసక్తి ఉన్న 705 మందికి ప్లేస్మెంట్ కల్పించింది. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (ఎస్సీఏ) ద్వారా వివిధ కోర్సుల్లో 433 మందికి శిక్షణ ఇచ్చి 309 మందికి ఉద్యోగం కల్పించింది. అలాగే ఈ నాలుగేళ్లలో వివిధ జాబ్‌మేళాలు నిర్వహించింది. వీటికి 2,731 మందికి హాజరవగా 1,142 మందికి ఉద్యోగాలు కల్పించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అపోలో, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ వంటి కార్పొరేట్ కంపెనీలతోపాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు జాబ్‌మేళాలు నిర్వహించాయి. తమ కంపెనీ అవసరాలకు సరిపడిన యువతను ఎంపిక చేసుకున్నాయి. వారం రోజుల్లో ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకున్నాయి.
శిక్షణ.. జాబ్‌మేళాల నిర్వహణ
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం), స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (ఎస్సీఏ) ద్వారా శిక్షణ, జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా నేరుగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. రెండు, మూడు నెలల కోర్సుల్లో జిల్లా కేంద్రంలోని నవభారత్, ఐటీసీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)సెంటర్ల ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తోంది. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, డిప్లొమో, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన అభ్యర్థులకు హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల్లోని కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఉన్నత విద్యనభ్యసించి స్థానికంగానే ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తోంది. వారు ఉద్యోగంలో నిలదొక్కుకునేలా చేస్తోంది.
జాబ్‌మేళాలో ఉద్యోగం వచ్చింది..
డీఆర్డీఏ జాబ్‌మేళాకు హాజరై ఉద్యోగం పొందాను. ప్రస్తుతం ఇల్లెందు యాక్సిస్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. ప్రతి విద్యార్థికీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. గ్రామాల్లోని యువతకు డీఆర్డీఏ సంస్థ జిల్లా కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.
-ఎం.శ్రీకాంత్, ఇల్లెందు
సద్వినియోగం చేసుకోవాలి..
యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. కొన్ని కంపెనీలు శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు వారి విద్యార్హతను బట్టి నేరుగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. శిక్షణ, జాబ్‌మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలి.