నానక్‌నగర్‌లో మేకల మందపై దాడి
సంఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఏర్పాటు
యాచారం, జనవరి 9 : మండలంలోని నానక్‌నగర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత శనివారం అర్ధరాత్రి మేకల మందపై దాడి చేసి ఒక మేకను చంపిన ఘటన గ్రామంలో ఆదివారం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి గ్రామస్తులు, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నానక్‌నగర్ గ్రామానికి చెందిన తాండ్ర రామచంద్రయ్య రైతు పొలంలో శనివారం చిరుతపులి సంచరించి మేకల మందపై దాడి చేసింది. అందులో ఒక మేకను సమీపంలో ఉన్న కొండగుట్టపైకి తీసుకెళ్లి చంపి తినేసింది. ఆదివారం పొలం వద్ద రైతు మేక లేదని రైతు గుర్తించాడు. మేకను ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లను గుర్తించిన రైతు వాటి ఆధారంగా నేరుగా గుట్టపైకి వెళ్లి చూడగా.. మేక చనిపోయి ఉంది. వెంటనే సర్పంచ్ పెద్దయ్యకు తెలిపాడు. సర్పంచ్ పెద్దయ్య సంబంధిత ఫారెస్టు బీట్ ఆఫీసర్‌కు సమాచారం అందించగా.. మేక ఉన్న స్థలం, మేకను పులి తిన్న స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
గతంలో తాటిపర్తి, కొత్తపల్లి, మేడిపల్లి, నానక్‌నగర్, నందివనపర్తి గ్రామాల్లోనూ చిరుత సంచరించి ఎన్నో మూగ జీవాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు చిరుత పీడ విరగడయ్యిందనుకున్న రైతులకు మళ్లీ చిరుత కలకలం రేపడంతో గొర్రెల కాపరులు, రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్టు అధికారులు వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల్లో బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించి మూగజీవాలను కాపాడాలని కోరుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు.
చిరుతనా..? హైనానా..?
నానక్‌నగర్‌లో సంచరించి మేకను మట్టుబెట్టిన జంతువు చిరుతనా..? హైనానా అనే సందిగ్ధంలో ఫారెస్టు అధికారులున్నారు. గతంలో చిరుతలు ఇక్కడ సంచరించినందున ఇది చిరుత పనే కావచ్చని అధికారులు భావిస్తున్నారు. కానీ ఇటీవల ముద్విన్, తాటిపర్తి ఫారెస్టుల్లో హైనాలు సంచరించడంతో ఇది హైనా పని కూడా అయ్యండొచ్చని కందుకూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ నిఖిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మేకను సగం తిని సంగం బండచరియలో దాచిపెట్టుకున్నందున.. మిగతా మాంసాన్ని తినడానికి వచ్చే అవకాశాలున్నందున సీసీ కెమెరాలకు మేకను తిన్న జంతువు దృశ్యాలు చిక్కే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మేకను తిన్న జంతువు చిరుతనా..? హైనానా అని పూర్తి స్థాయిలో నిర్ధారణ అయిన తరువాత దానిని పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గొర్రెల కాపరులు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.