సాగు కష్టాలు తీర్చిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
రాష్ట్రంలో నాలుగేండ్లలో రూ.50,600కోట్లు రైతుబంధు ఇచ్చాం : మంత్రి సబితారెడ్డి
తాండూరులో ఘనంగా రైతుబంధు సంబురాలు
ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఉత్సాహంగా రైతుల ర్యాలీ
తాండూరు, జనవరి 9 : ముందెన్నడూ లేని విధంగా రైతుల ఖాతాల్లో పంట సాయం పెట్టుబడి జమవుతుండడంతో రైతుల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఆదివారం తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిర్వహించిన రైతుబంధు సంబురాలు ఆకట్టుకున్నాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు ఉత్సాహంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జై కిసాన్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నవధాన్యాలతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని వ్యవసాయ శాఖ సిబ్బంది వేశారు. రైతులు ఎడ్లు, బండ్లను అందంగా అలంకరించి టీఆర్ఎస్ జెండాలను పట్టుకొని నినాదాలు చేస్తూ తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లతో పాటు కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు బజారులో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో యాసంగికి రూ.7,500 కోట్ల పంట సాయం అందిందన్నారు. నాలుగేండ్లలో రైతులకు రూ.50,600 కోట్ల రైతుబంధు ఇచ్చామని చెప్పారు. రైతులకు టీఆర్ఎస్ అందిస్తున్న సాయాన్ని చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రైతుబంధు సంబురాలు సంక్రాంతి వరకు జరుగుతాయని వెల్లడించారు. ఎవరు ఎన్ని కుంట్రలు పన్నినా టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికీ లేదని సవాల్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలుపై బీజేపీ వ్యవహారం బయటపడడంతో రైతులను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ టీఆర్ఎస్పై కుట్రలు పన్నుతున్నదన్నారు. రైతుల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ప్రత్యేక సమావేశాలు, సలహాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ చక్కటి ఆలోచనలతో రైతు వేదికలు నిర్మించారని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తే సరైన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దీప నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, రైతుబంధు సమితి ప్రతినిధులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.