
శేరిలింగంపల్లి, జనవరి 9: అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్‌లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాతయాదవ్ అందించిన రూ. 40 లక్షల ఆర్థిక సహాయంతో నూతనంగా నిర్మించిన హనుమాన్ వ్యాయామశాలను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన కనీస వసతులను కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లపుడు ముందుంటుందని అన్నారు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాతయాదవ్ ఆర్థిక సహాయం అందించి వ్యాయామశాల నిర్మాణానికి తొడ్పాటునందించడం శుభపరిణామం అని అన్నారు. స్థానిక యువకులకు ఈ వ్యాయామశాల ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత జీవితంలో రాణించాలని సూచించారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. బాపునగర్‌లో రాగం దంపతులు తగిన ఆర్థిక సహాయం అందించి స్థానిక యువతకు వ్యాయామశాలను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నానని అన్నారు. శేరిలింగంపల్లి టీఆర్ఎస్ యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.