కాలేజీలు, స్కూళ్లవారీగా ఏర్పాట్లు
15 నుంచి 18 సంవత్సరాల వారికి జోరుగా కరోనా వ్యాక్సినేషన్
అందుకు తగ్గట్టే వైద్యశాఖ సన్నద్ధం
హయత్‌నగర్ రూరల్, జనవరి 8: ‘నాది ఫస్ట్ డోస్ అయిపోయింది. నీది ఇంకా కాలేదా?’ కరోనా వ్యాక్సిన్ వేసుకోని విద్యార్థికి టీకా తీసుకున్న ఓ విద్యార్థి ప్రశ్న. ‘అమ్మా.. కాలేజీలో ఫ్రెండ్స్ అందరం ఒకేసారి వ్యాక్సిన్ వేయించుకున్నాం’ ఓ కాలేజీ విద్యార్థిని మాట.. ఇలా ఏ కాలేజీలో చూసినా, ఏ ఉన్నత పాఠశాలలో అయినా వ్యాక్సిన్ మాటలే వినిపిస్తున్నాయి. ఏ విద్యార్థిని నోట విన్నా ఇవే మాటలు వస్తున్నాయి. కరోనా భయపెడుతున్న సమయంలో టీకా తీసుకుంటున్న విద్యార్థులు భరోసాతో ఉంటున్నారు.
కాలేజీల వారీగా..
‘మీ పేరు ఏమిటి? ఆధార్‌కార్డు నంబర్ చెప్తారా? ఫోన్ నంబర్ చెప్పండి’ ఇప్పుడు ఏ కాలేజీలో చూసినా ఈ వివరాలే సేకరిస్తున్నారు. ఎందుకంటారా? ఇంకెందుకేంటి.. కరోనా వ్యాక్సిన్ కోసమే. 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల వయసున్న విద్యార్థులు, యువతకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. ముందస్తుగా ఒక్కో కాలేజీకి వైద్య అధికారులు సమాచారం ఇస్తున్నారు. యాజమాన్యాలు, అధ్యాపకులతో మాట్లాడుతున్నారు. విద్యార్థుల చెంతకే వచ్చి టీకా వేస్తామని చెప్తున్నారు. విద్యార్థులు ముందుగానే వారి తల్లిదండ్రులతో మాట్లాడేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ తెచ్చేలా చూస్తున్నారు. ఇందుకు అధ్యాపక బృందాలు సైతం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాయి.
హాస్టళ్లు.. బడుల్లోనూ..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవారీగా 15 ఏండ్లు పైబడిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారనే గణాంకాలు తీస్తున్నట్టు ఇబ్రహీంపట్నం డివిజన్ వైద్యాధికారి పీ శ్రీనివాస్ తెలిపారు. కాలేజీలు, పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యను తెప్పించుకుంటున్నారు. ఏయే పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? వారికి ఎంత మొత్తంలో వ్యాక్సిన్ తీసుకెళ్లాలి తదితర అన్ని పర్యవేక్షిస్తున్నట్టు అబ్దుల్లాపూర్‌మెట్ పీహెచ్సీ సూపర్వైజర్ గంజి గోపాల్ తెలిపారు.
రోజురోజుకూ పెరుగుతున్న ప్రక్రియ
వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకొస్తున్న 15-18 ఏండ్లవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. తొలిరోజు వ్యాక్సిన్ వేసుకునేందుకు కొంతమంది వెనుకాడారు. కానీ, వారంలో పరిస్థితులు మారిపోయాయి. విద్యార్థులంతా వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇబ్రహీంపట్టణం డివిజన్లోని 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖాన, జీసీహెచ్, సీహెచ్‌సీ కలిపి తొలిరోజు (ఈ నెల 3న) 393 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సంఖ్య 6వ తేదీకి 3,656కు చేరింది. 7వ తేదీ నాటికి మొత్తంగా 12,472 మంది 15 నుంచి 17 ఏండ్లలోపు వారు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు వైద్యాధికారుల లెక్కలు చెప్తున్నాయి.