ఊరూరా కొనసాగుతున్న వారోత్సవాలు
జోరుగా ముగ్గుల పోటీలు.. ఆడిపాడిన మహిళలు
జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు
నేడు ఉత్తమ రైతులకు సన్మానాలు
రంగారెడ్డి, జనవరి 8, (నమస్తే తెలంగాణ);రైతుబంధు వారోత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఆయా వేడుకల్లో ఎమ్మెల్యేలు పాల్గొని రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. మహిళలు బతుకమ్మ ఆడి పాడారు. రైతులు ప్లకార్డులు, ఫ్లెక్సీలు చేతబూని జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నేడు వారోత్సవాల్లో భాగంగా ఉత్తమ రైతులకు సన్మానాలు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు మేరకు ఊరూరా.. రైతు బంధు వారోత్సవాలను పండుగలా నిర్వహిస్తున్నారు. శనివారం పలు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంబంధిత పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కులకచర్ల మండలం అంతారం గ్రామంలో పంట పొలంలో రైతులతో కలిసి పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు బంధుతో రైతులందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అన్నదాతలకు సన్మానం చేశారు. ధారూరు మండలం రాంపూర్ తండాలో నిర్వహించిన వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులను అందజేశారు. గిరిజన మహిళలలతో కలిసి ఆడిపాడారు. శంకర్పల్లి మండలం పొద్దుటూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతు బంధు వారోత్సవాలు రేపటితో ముగియనున్న దృష్ట్యా ఈ రెండు రోజులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహించేందుకుఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా నేడు ఉత్తమ రైతులకు సన్మానాలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులతో సమీక్షలు చేయనున్నారు. సోమవారం అన్ని గ్రామాలు, మండలస్థాయిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా ర్యాలీలు పెద్దఎత్తున నిర్వహించనున్నారు.