మామిడి రైతుల శిక్షణలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సునందారెడ్డి
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 5 : పండ్లు, కూరగాయలు పండించే రైతులు సంఘటితశక్తిగా ఏర్పడితే దళారులను దరిచేరనివ్వకుండా చేయవచ్చని, తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచుకోవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి సునందారెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామంలో బత్తుల విజయరంగారెడ్డి మామిడి తోటలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీకృష్ణ, సుబ్బారెడ్డి, సహకార అధికారి చంద్రమోహన్‌రెడ్డితో కలిసి మామిడి రైతులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి సునందారెడ్డి మాట్లాడుతూ.. మామిడి తోటలకు డిసెంబర్ నుంచే పూత వస్తుందని, పూత, కాతలను కాపాడుకోవాలంటే సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. పిందెలు గోలి పరిణామంలో ఉన్నప్పుడు పాదుల్లో 4 అంగుళాల మేర పదునుండేలా తడుపాలని తెలిపారు. నీటి వసతి సరిగ్గాలేనిచోట కాయ పెరుగుదలను పెంచడానికి లీటర్ నీటికి 15గ్రా. యూరియాను కలిపి పిచికారీ చేయాలన్నారు. పూత వచ్చిన తోటలను తేనె మంచు పురుగులు, గాల్మిడ్జి పురుగులు, బూడిద తెగులు రాకుండా అసేఫేట్ 1.5గ్రా, అక్రిసియో 0.3 మి.గ్రా. కలిపి పిచికారీ చేయాలన్నారు. రైతులు అధిక లాభాలు గడించడానికి రాచకొండ రైతుల ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడ్డారని, రైతులు దీనిలో చేరి.. తమ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, రైతు ఉత్పత్తిదారులు సంఘం అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, డైరెక్టర్లు దామోదర్‌రెడ్డి, యాదయ్య, శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు. అనంతరం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు బంధు సంబురాలు నిర్వహించారు.