ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన రైతుబంధు వారోత్సవాలు మండల వ్యాప్తంగా అంబరాన్నంటాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో రైతుబంధు వారోత్సవాలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బుధవారం రైతువేదికల అలంకరణ, రైతువేదికల వద్ద రైతుబంధు ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా ముగ్గుల పోటీలు, 6న పాఠశాలల్లో రైతుబంధుపై ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు, ముగ్గుల పోటీలు, 7న ప్రతి ఇంట్లో రంగులతో రైతుబంధు గురించి రంగులతో, పూలతో, ధాన్యంతో పండ్లతో ముగ్గులు వేసే ప్రదర్శనలు, 8న ఉత్తమ రైతుల సన్మానం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖ రైతులతో సమీక్ష, 9న వ్యవసాయ మార్కెట్ కమిటీ, సహకార సంఘాల కార్యాలయాల్లో రైతుబంధు గురించి అలంకరణ ప్రదర్శన, 10న మండల స్థాయిలో ఎండ్లబండ్లు, ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ఎంపీడీవో మహేశ్‌బాబు, వ్యవసాయాధికారి వరప్రసాద్‌రెడ్డి, ఎంఈవో వెంకట్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం రవీందర్, ఏపీవో లలిత పాల్గొన్నారు.
నేడు నియోజకవర్గ వ్యాప్తంగా రైతువేదికల అలంకరణ
ఇబ్రహీంపట్నం, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టి రైతుల కండ్లలో ఆనందాన్ని నింపుతున్న రైతుబంధు పథకం వారోత్సల్లో భాగంగా బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా రైతువేదికల అలంకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ఉప్పరిగూడ, ముకునూరు, మంచాల, ఆరుట్ల, బోడకొండ, యాచారం, మేడిపల్లి, చౌదర్పల్లి, మాల్, అబ్దుల్లాపూర్‌మెట్ రైతు వేదికలను అలంకరించారు. ఈ వారోత్సవాలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు.