ఊరూరా రైతుబంధు సంబురాలు.. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, రైతులు
గ్రామాల్లో రైతులతో ప్రత్యేక సమావేశాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
7817 మందికి రూ.21.07కోట్లు
పరిగి, జనవరి 4 : రైతుల ఖాతాల్లోకి రూ.50వేల కోట్ల పెట్టుబడి సాయం చేరుతున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ సంక్షేమ పథకం కర్షకుల ఆర్థిక పరిపుష్టికి బాటలు వేసింది. ఎవుసానికి ఎంతో ఊతమిచ్చిన ‘రైతుబంధు’ తమ జీవితాల్లో పండుగ తెచ్చిందని రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ మేరకు ఉత్సాహంతో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కొన్నిచోట్ల మిఠాయిలు పంచుకొని అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించారు.
పంటల సాగుకు సంబంధించి రైతుబంధు కింద ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న సందర్భంగా రాష్ట్రంలో విడుతల వారీగా సుమారు రూ.50వేల కోట్లు అందించిన సందర్భంగా రైతుబంధు సంబురాలు వికారాబాద్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిధిలోని గ్రామాల్లో వ్యవసాయాధికారులు రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో 97 క్లస్టర్లు ఉండగా, ప్రతి క్లస్టర్లో ఒక గ్రామంలో సమావేశాలు నిర్వహించారు. రైతుబంధు కింద జిల్లాలోని రైతులకు అందించిన పెట్టుబడి సహాయం వివరాలు తెలియజేశారు. రైతుబంధు ఉపయోగించుకొని పంటలు పండించి ఆర్థిక ప్రగతి సాధించాలని వ్యవసాయాధికారులు సూచించారు. వికారాబాద్‌లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి నియోజకవర్గం కులకచర్ల మండలం చాపలగూడెంలో వ్యవసాయ పొలంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. బుధవారం నుంచి జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు.
7817 మందికి రూ.21.07కోట్లు
రైతుబంధు కింద మంగళవారం వికారాబాద్ జిల్లా పరిధిలో 7817 మంది రైతులకు రూ.21,07,49,289 వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రైతుబంధు కింద మొత్తం 2,23,108 మంది రైతులకు రూ.233,97,89,664 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ప్రతిరోజూ రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను ప్రభుత్వం జమ చేస్తున్నది.