దాదాపు కోటి రూపాయల వరకు మోసపోయిన వికారాబాద్ వాసులు
లైమ్ కంపెనీ యాప్ పేరిట లింక్ పంపి మోసం
మొదట కొద్దిమందికి రెట్టింపు సొమ్ము ఇచ్చిన సైబర్ నేరగాళ్లు
ఆశతో అనేకమంది అప్పులుచేసి కట్టిన వైనం
పూడూరు మండలం కడ్మూర్లో దాదాపు 200 మంది బాధితులు
నాలుగు నెలల నుంచి సాగుతున్న మోసం
హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు
కొనసాగుతున్న దర్యాప్తు
పూడూరు, జనవరి 4: సైబర్ నేరగాళ్ల చేతిలో వందల సంఖ్యలో యువకులు నాలుగు నెలలుగా చిక్కుకుని మోసపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కడ్మూరు గ్రామంలో వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు యువకులను వలలో వేసుకునేందుకు ఇంటి వద్దే ఆన్లైన్లో ఉపాధి అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో కొందరు యువకులు ఆశపడి లైమ్ కం పెనీ యాప్‌ను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మొదటగా రూ.5 వేలు చెల్లిస్తే రూ.10వేలు వస్తాయని ఆశతో జమ చేశారు. ముందుగా చెల్లించిన కొంతమందికి రూ.5 వేలకు రూ.10వేలను సైబర్ నేరగాళ్లు వారి అకౌంట్లలో వేసి ఆశచూపారు. దీంతో కొందరు యువకులు తమ స్నేహితులకు ఈ యాప్ ద్వారా అధిక డబ్బులు వస్తున్నాయని ప్రచారం చేశారు. కడ్మూరు గ్రామానికి చెందిన సుమారు 200మంది యువకులు ఆన్లైన్లో లైమ్ కం పెనీ లింక్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. కొందరు అత్యాశపడి రూ.10వేల నుంచి రూ.లక్షల వరకు ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో జమ చేశారు. గ్రామానికి చెం దిన సాంబ అనే యువకుడు గత ఏడాది 19/11/ 2021న రూ.5,500లు చెల్లించగా అతడికి 20 రోజుల్లో సైబర్ నేరగాళ్లు రూ.14 వేలను అతడి ఆన్లైన్ ఖాతాలో జమచేశారు. ఆ యువకుడు ఆ డబ్బును ఆన్లైన్ ఖాతా నుంచి తమ బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకొని, మళ్లీ అధిక డబ్బులకు ఆశపడి జమ చేశాడు. డిసెంబర్ 31న డబ్బులు జమ అయ్యాయా అని చూసుకోగా యాప్ పని చేయకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. దీంతో గ్రామంలో డబ్బులు చెల్లించిన అధిక సంఖ్యలో యువకులందరూ మోసపోయినట్లు గుర్తించి ఆందోళన చెందా రు.
బాధితుల్లో కొందరు మాట్లాడుతూ సీమా అనే మహిళ న్యూఇయర్ ఆఫర్ అంటూ యువకులతో వాట్సాప్ చాట్ చేసినట్లు తెలిపారు. గ్రామంలో సుమారుగా 200 మంది వరకు, దాదాపు రూ. కోటి వరకు డ బ్బులు పోగొట్టుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధికంగా డబ్బులు వస్తున్నాయని ఆశతో కొంతమంది యువకులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి మరీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. మోసపోయిన విషయం తెలుసుకున్న కొందరు యువకులు హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్ బ్రాంచ్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై చన్గోముల్ ఎస్సై శ్రీశైలంను వివరణ కోరగా.. కడ్మూరు గ్రామంలోని కొంత మంది యువకులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయం నిజమేనని తెలిపారు. బాధితులు తమ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా సైబర్ క్రైమ్ బ్రాం చ్ కు వెళ్లి ఏడుగురు బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. అక్కడి నుంచి పీఎస్‌కు సమాచారం అం దిందని, కడ్మూరు గ్రామానికి వెళ్లి బాధితులను కలిసి జరిగిన విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
అధిక డబ్బులకు ఆశపడి మోసపోయా
లైమ్ యాప్ ద్వారా రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశపడ్డా. నాలుగు నెలల క్రితం ఈ యాప్ ద్వారా అధిక డబ్బులు వస్తున్నట్లు తెలుసుకున్నా. రూ.5వేలు జమ చేస్తే కొన్ని రోజుల తర్వాత రూ.10వేల వరకు వచ్చా యి. మళ్లీ డబ్బులను ఆ యాప్‌లో జమ చేసి చూసుకోగా యాప్ పని చేయడంలేదని తెలుసుకుని మోసపోయినట్లు గుర్తించా. గ్రామంలో నాతోపాటు చాలామంది యువకులు కూడా ఈ యాప్‌లో డబ్బులు జమ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
-ఎం.సాంబ, కడ్మూరు, పూడూరు