సీఎం కేసీఆర్ పిలుపుతో ముందుకొస్తున్నసబ్బండ వర్గాలు
40 కేజీలకుపైగా బంగారాన్ని విరాళంగా ప్రకటించిన పలువురు
ఆలయ ఖాతాలో 3.97కోట్ల నగదు జమ
క్యూఆర్ కోడ్ ద్వారానూ జమ చేయొచ్చు :ఈఓ గీత
యాదాద్రి భువనగిరి, నవంబర్3(నమస్తే తెలంగాణ ప్రతినిధి);మన ఆధ్యాత్మిక సంపద యాదాద్రి పంచ నారసింహ క్షేత్రాన్ని భక్తజనం సెంటిమెంటల్‌గా ఓన్ చేసుకుంటున్నది. కృష్ణశిలతో అత్యద్భుతంగా పునర్నిర్మితమైన ఆలయంలో విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించేందుకు చేయిచేయి కలుపుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునందుకుని సబ్బండ వర్గాల ప్రజలు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు 40కేజీలకుపైగా బంగారాన్ని సమర్పిస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆలయ ఖాతాలో 3.97కోట్ల నగదును జమ చేశారు. ఈ మహాకార్యంలో సామాన్య భక్తులు సైతం పాలుపంచుకునేలా వైటీడీఏ అధికారులు బాలాలయంలో ప్రత్యేక హుండీని ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల్లో ఉండి నేరుగా సమర్పించడం వీలుపడని వారు ఆన్లైన్లో విరాళాలు సమర్పించేందుకు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అదృష్టంగా భావించి, ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆలయ అధికారులు, ప్రధానార్చకులు కోరుతున్నారు.
యాదాద్రీశుడికి బంగారు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో ప్రముఖులతోపాటు సామాన్యులు సైతం తమ శక్తిమేర విరాళాలు ఇస్తున్నారు. యాదాద్రి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయడానికి 125 కిలోల బంగారం అవసరం అవుతుండగా.. ఇందుకోసం రూ.60కోట్ల ఖర్చు కానుంది. ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రతి పైసాను తెలంగాణ ప్రభుత్వమే వెచ్చిస్తుండగా.. ఇప్పటివరకు చేపట్టిన పనులకు రూ.850కోట్ల వరకు ఖర్చు చేసింది. విమానం గోపురానికి అవసరమయ్యే మొత్తం బంగారాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ.. భక్తులు కూడా భాగస్వామ్యమైతే ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నామన్న సంతృప్తి ఉంటుందన్న ఉద్దేశంతో విరాళాలు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా కమిటీ పర్యవేక్షణలో పక్కాగా జరుగనుండగా.. స్వర్ణ తాపడం కోసం వినియోగించే మేలిమి బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇప్పటివరకు రూ.3.97 కోట్ల భూరి విరాళాలు
వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు మూలవరుల దర్శన భాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటిలోగా ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. గత అక్టోబర్ 19న యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అలాగే.. ఈ పవిత్ర కార్యానికి తొలి విరాళాన్ని సీఎం కేసీఆరే ప్రకటించారు. తమ కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ప్రకటించారు. సీఎం కేసీఆర్ పిలుపుతో విరాళాలు భారీగా వచ్చిచేరుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థల అధిపతుల దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులపాటు వివిధ వర్గాల వారు బంగారానికి సరిపడా నిధులను విరాళంగా అందిస్తున్నారు. వ్యక్తిగతంగా కొందరు, నియోజకవర్గ ప్రజల పక్షాన మరికొందరు కిలో బంగారం చొప్పున ఇస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల చొరవతో విరాళాల సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులు, మేడ్చల్ ప్రజానీకం తరఫున మూడున్నర తులాలకు సమానమైన 1.82కోట్ల నగదును ఆలయానికి అందించారు. సామాన్య ప్రజానీకం సైతం ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో విరాళాలను వేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు వేతనాల్లో కొంత విరాళం ఇస్తుండగా.. పలువురు చిన్నారులు కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను సైతం ఇస్తుండడం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపందుకుని ఇప్పటివరకు దాదాపు 40కిలోల బంగారం వరకు దాతలు ప్రకటించగా రూ.3.97కోట్ల విరాళాలు ఆలయ ఖాతాలో జమ అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రూ.2.53కోట్లు నగదు రూపంలో, రూ.94లక్షలు చెక్కుల రూపంలో, మరో రూ.50లక్షలు డీడీల రూపంలో వచ్చినట్లు వారు చెప్తున్నారు.
ముక్తిదాయకం.. విమాన గోపురం..
ఏడేడు లోకాలు ఏలే స్వామి దర్శనం దూరం నుంచే ప్రాప్తించేలా నిర్మాణపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. సప్తగోపురాల సన్నిధి.. ఆద్యంతం ఆధ్మాత్మికతను పెంపొందిస్తుండగా.. స్వామివారి గర్భాలయంపై పంచతల విమాన గోపురానికీ ఓ విశిష్టత ఉన్నది. 45 అడుగుల ఎత్తులో ఐదు అంతస్తులతో ఈ నిర్మాణాన్ని కృష్ణశిలతో నిర్మించారు. అల్లంత దూరంలో ఉండగానే.. కన్పించే ఈ గోపురం ముక్తిదాయకమని..స్వామివారి దర్శనం ఇచ్చే ఫలాన్ని ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు. బంగారు తాపడంతో స్వర్ణశోభితమయ్యే విమాన గోపురం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
గౌరవప్రదమైన అవకాశం..
ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్యకార్యం. ఇందులో పాలుపంచుకోవడం గౌరవ ప్రదమైన అవకాశం. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణంలో తాము సైతం భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావించి చాలామంది విరాళాలు అందజేసేందుకు ముందుకు వస్తుండడం శుభ పరిణామం. బంగారానికి సమానమైన మొత్తాన్ని, నగదు, చెక్కులు, డీడీల రూపంలో అందిస్తున్నారు. ఇక్కడకు రాకుండా విరాళాలు ఇచ్చేలా క్యూ ఆర్ కోడ్‌ను సైతం అందుబాటులోకి తెచ్చాం. సీఎం కేసీఆర్ గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఈ పవిత్ర కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరుతున్నాం.
స్వామీ… మీకు మా బంగారు ముడుపులు..
యాదాద్రీశుడి గర్భాలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. రాష్ట్రం, దేశం, ఇతర దేశాల వ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులు తమకు తోచిన వీసమెత్తో, గుండెత్తో, పావుతులమయినా ఇచ్చి భాగస్వాములు కావాలి. స్వామివారికి విరాళం అందించే భక్తులు శుచి, శుద్ధితో తమ ఇంట్లోనే ఆ లక్ష్మీనారసింహుడి ప్రతిమ వద్దకు వెళ్లి ‘యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామీ.. మీ బంగారం తాపడానికి మా శక్తి మేరకు ముడుపు చెల్లిస్తున్నాను’ అంటూ స్వామివారికి ముడుపు చెల్లించవచ్చు. యాదాద్రి ఆలయ ఖాతాలోగానీ, నేరుగా స్వామివారి ఆలయానికి విచ్చేసి జమ చేయవచ్చు.