రాష్ట్రంలో 500 భవిత సెంటర్లలో
50వేల మందికి ఫిజియోథెరపీ
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పరిగి, డిసెంబర్ 3 : ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ డీపీఆర్సీలో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5శాతం కేటాయించేలా సర్కారు కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యేల సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోనూ అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 భవిత సెంటర్లలో 50వేల మంది దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేయిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 833 మందికి ఫిజియోథెరపీ చేయించగా, 23 మంది సాధారణ స్థితికి మారారని, ఇది సంతోషించదగ్గ విషయమన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా దివ్యాంగులకు అందజేసే పరికరాలను సైతం అత్యాధునికమైనవి అందజేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో 70శాతం అంగ వైకల్యం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణలో 45శాతం వైకల్యం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల్లో 3 నుంచి 4 శాతానికి రిజర్వేషన్ పెంచామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల గౌరవాన్ని పెంచేలా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సామాజిక సమైక్యతలో భాగంగా దివ్యాంగులు, సాధారణ వ్యక్తుల మధ్య వివాహాలను ప్రోత్సహించడానికి రూ.50వేలు నగదు ప్రోత్సాహం అందిస్తుండగా, దీన్ని లక్ష రూపాయలకు పెంచినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 20 మందికి ఈ ప్రోత్సాహం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా బ్రెయిలీ పలకలు, ల్యాప్‌టాప్‌లు, మోటారు యంత్రాలు, ఎంపీ3 ప్లేయర్లు, డిగ్రీ, పీజీ చదువుకుంటున్న వారికి మోటరైస్ట్ వాహనాలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగి సమాజంలో అందరి కంటే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులు నేరుగా పోలింగ్‌బూత్‌కు వచ్చి ఓటు వేసేందుకు ర్యాంపులు సైతం ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ కింద బాగా పనిచేసిన దివ్యాంగులను మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైరపర్సన్ సునీతారెడ్డి సన్మానించారు. 8 మందికి సబ్సిడీ రుణాలు రూ.16లక్షలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అంగన్వాడీ వర్కర్లకు స్మార్ట్ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి బాలరక్షక్ వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి లలితకుమారి, జిల్లా విద్యా శాఖాధికారి రేణుకాదేవి, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు.