ఈనెల 10 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
రైతు సంక్షేమ పథకాలపై అవగాహన
ఈనెల 10న రైతు వేదికల వద్ద ముగింపు వేడుకలు
వారోత్సవాల్లో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలు, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన తదితర పోటీలు
ఇబ్రహీంపట్నంలోని కర్ణంగూడలో వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
రంగారెడ్డి, జనవరి 3, (నమస్తే తెలంగాణ) : రైతుబంధు సాయంతో పెట్టుబడికి అప్పులు చేసే బాధలు తీరగా.. అన్నదాతలు పండుగ చేసుకుంటున్నారు. కొన్నేండ్లుగా ఎకరాకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందుకుంటూ పంటల సాగుకు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేల కోట్ల రైతుబంధు సాయం అందనున్నది. దీంతో సోమవారం నుంచి వారం రోజులపాటు రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, రైతులు వేడుకలకు శ్రీకారం చుట్టారు. రోజుకో కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. తొలిరోజు పలు నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్, రైతుబంధు తదితర సంక్షేమ పథకాల పేర్ల ఆకారంలో వరినాట్లు వేసి అన్నదాతలు అభిమానాన్ని చాటారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే రైతుబంధు వారోత్సవాలను నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమయ్యారు.
రైతులను అప్పుల ఊబి నుంచి తప్పించేందుకుగాను సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. గత నాలుగేండ్లుగా పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నాటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేల కోట్ల రైతుబంధు సాయం అందనున్న దృష్ట్యా సంబురాలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ఈనెల 10 వరకు వారం రోజులపాటు ఊరూరా రైతుబంధు వారోత్సవాలను నిర్వహించనున్నారు. తొలిరోజు జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కర్ణంగూడలో స్థానిక ఎమ్మెల్యే వరి నాట్లు వేసి రైతుబంధు వారోత్సవాలను ప్రారంభించి, రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. మరోవైపు కొవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే వారోత్సవాలను నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు గ్రామగ్రామానా సంబురాలు చేసేందుకు జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికై అమలు చేస్తున్న పథకాలపై రైతులు, మహిళలు, యువకులను కలుపుకొని ఇంటింటికెళ్లి రైతులకు అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలనూ నిర్వహించనున్నారు. మరోవైపు రైతువేదికల్లో రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ముగింపు రోజున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇంటి ముంగిట వేసే ముగ్గుల్లోనూ రైతుబంధు ప్రతిబింబించేలా టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటి వరకు రూ.223 కోట్ల రైతుబంధు జమ..
యాసంగి సీజన్ రైతుబంధులో భాగంగా ఇప్పటి వరకు రూ.223.59 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,65,566 మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. సోమవారం 20,319 మంది రైతులకుగాను రూ.41 కోట్ల రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో యాసంగి సీజన్‌కుగాను 3,48,556 మంది పట్టాదారులను రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే రైతుబంధు పథకం కింద గత నాలుగేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1966 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేశారు. అయితే 2018 వానాకాలం సీజన్లో 2,47,688 మంది రైతులకుగాను రూ.257 కోట్లు, యాసంగిలో 2,21,096 మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 2,30,155 మంది రైతులకుగాను రూ.257 కోట్లు, యాసంగి సీజన్లో 1,87,804 మంది రైతులకుగాను రూ.182 కోట్ల పెట్టుబడి సాయాన్ని, 2020 వానకాలం సీజన్లో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344 కోట్ల పెట్టుబడిని, 2021 వానకాలం సీజన్లో 2,82,094 మంది రైతులకుగాను రూ.343 కోట్ల ఆర్థిక సాయాన్ని, యాసంగి సీజన్లో ఇప్పటి వరకు రూ.223 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.