తొలిరోజు 2,379 మందికి..
రంగారెడ్డి జిల్లాలో 2,24,664 మంది, వికారాబాద్ జిల్లాలో 77,780 టీనేజర్లు
రంగారెడ్డి, జనవరి 3, (నమస్తే తెలంగాణ):ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ షురూ అయ్యింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ నెల 1 నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించగా.. విశేష స్పందన లభిస్తున్నది. అర్బన్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరికాగా, గ్రామీణ ప్రాంతంలో ఆధార్ కార్డులతో నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకునే వీలు కల్పించారు. రంగారెడ్డి జిల్లాలో 15-18 ఏండ్ల టీనేజర్లు 2,24,664 మంది ఉండగా.. వికారాబాద్ జిల్లాలో 77,780 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 46, వికారాబాద్ జిల్లాలో 26 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. పిల్లలకు కేవలం కొవాగ్జిన్ టీకా ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 2,379 మంది టీనేజర్లకు టీకాలు వేశారు.
-రంగారెడ్డి, జనవరి 3, (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15-18 ఏండ్ల టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సోమవారం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా, ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా, కొవిన్ యాప్‌లో ఆధార్ కార్డు, ఆధార్ కార్డు లేని వారు విద్యార్థి గుర్తింపు కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే అర్బన్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరికాగా, గ్రామీణ ప్రాంతంలో ఆధార్ కార్డులతో నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో 15-18 ఏండ్ల టీనేజర్లు 2,24,664 మంది ఉన్నారు. ఇందులో బాలురు 1,14,556 మంది, బాలికలు 1,10,108 మంది ఉండగా.. తొలిరోజు 1858 మంది టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 46 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను చేపడుతున్నారు. మరోవైపు జిల్లాలో 18 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 45 లక్షల డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇందులో ఫస్ట్ డోస్‌కు సంబంధించి 27 లక్షల డోసులు (114 శాతం), సెకండ్ డోస్‌కు సంబంధించి 19 లక్షల డోసులు పంపినీ చేశారు.
వికారాబాద్ జిల్లాలో 521 మందికి..
పరిగి, జనవరి 3 : టీనేజర్లకు కొవిడ్ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేయించుకున్న 15 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి టీకాలు వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో తాండూరు జిల్లా దవాఖాన, పరిగి, వికారాబాద్, మర్పల్లి క్లస్టర్ హెల్త్ సెంటర్లతోపాటు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి రోజు 521 మంది టీనేజర్లకు టీకాలు వేశారు. 15 నుంచి 18 ఏండ్లలోపు జిల్లాలో 77,780 మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా టీకా పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. 18 ఏండ్లు పైబడిన వారితో కాకుండా.. వీరికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టీకా ఇచ్చారు. జిల్లా పరిధిలో టీనేజర్లకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ జీవరాజ్ పర్యవేక్షించారు. టీనేజర్లుకు కొవాగ్జిన్ టీకాలు వేస్తుండగా.. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.