రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్
షాబాద్ మండలంలో పర్యటన
షాబాద్, జనవరి 3: గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని సర్దార్‌నగర్, కేశారం, కక్కులూర్ గ్రామాలను ఆయన సందర్శించారు. అనంతరం గ్రామాల్లో పల్లెప్రగతిలో చేపట్టిన హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాలు, ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పాంఫాండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం నర్సరీలో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను స్వచ్ఛత దిశగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది హరితహారం కార్యక్రమానికి సంబంధించి అవసరమయ్యే మొక్కలను ఆయా గ్రామాల్లో నర్సరీల్లో పెంచాలని సూచించారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లోని పొలాల్లో నీటి నిల్వ కోసం ఫాంపాండ్స్ నిర్మాణం చేసుకోవాలన్నారు. పారిశుధ్యం లోపించకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరుపోసి సంరక్షించాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు మునగపాటి స్వరూప, భానూరి మమత, చల్లా సంధ్య, పంచాయతీ కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, ప్రభాకర్, గ్రామస్తులు శ్రీరాంరెడ్డి, జీవన్‌రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.