
మెదక్ జిల్లా నందిగామకు చెందిన తల్లీకొడుకు దుర్మరణం
సహాయక చర్యలకు బావిలో దిగిన గజ ఈతగాడి మృత్యువాత
కారును తీసేందుకు 7 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఏసీపీ
హుస్నాబాద్‌లో చిన్నమ్మ కూతురి బారసాలకు వెళ్తుండగా దుర్ఘటన
నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో విషాదం
దుబ్బాక/దుబ్బాక టౌన్/మిరుదొడ్డి, డిసెంబర్1 : కూతురి ఇంట్లో జరుగుతున్న బారసాలకు వెళ్తూ ప్రమాదవశాత్తూ కారు టైరు పగిలి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లి తల్లీ, కొడుకులు దుర్మరణం చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ శివారులో బుధవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి నిజాంపేట మండలం నందిగామకు చెందిన కారు ఓనరు అంబటి హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్‌లోని కూతురి ఇంట్లో జరుగనున్న బారసాలకు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లి లక్ష్మి (50)తో కలిసి సుదనం ప్రశాంత్(26) కారు(ఏపీ 23 ఎస్ 5566)లో బయలుదేరారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ శివారులోని చిన్నవాగు వద్దకు రాగానే, వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలడంతో రోడ్డు పక్కనే ఉన్న గ్రామ మాజీ ఎంపీటీసీ మంతూరి పెంటయ్య వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. కారు బావిలో పడుతున్న సమయంలో భారీగా శబ్ధం రావడంతో చుట్టు పక్కల వారు గమనించి వెంటనే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగగా, పోలీసు లు, అగ్నిమాపక సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సుమారు 7 గంటల పాటు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. బావిలో పూర్తిస్థాయిలో నీరు ఉండటంతో చీకటి పడుతుండటంతో కారును బయటకు తీయడం కష్టంగా మారింది. మోటర్ల సహాయంతో నీటిని తోడివేయడంతో పాటు రెండు భారీ క్రేన్లను వినియోగించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న దుబ్బాక ఎమ్మెల్యే, ఏసీపీ దేవారెడ్డి, దుబ్బాక, మిరుదొడ్డి మండలాల జట్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షించారు. దుబ్బాక, మిరుదొడ్డి మండలాలకు చెందిన రెవెన్యూ శాఖ అధికారులు, దుబ్బాక మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు. వ్యవసాయ బావి వద్ద భారీగా ముళ్ల పొదలు ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యమైంది. మృతుల్లో ఆకుల ప్రశాంత్ నందిగ్రామంలో ఎల్రక్ట్రిషన్గా పని చేస్తున్నాడు. ఇతడికి పెండ్లి కాలేదు. లక్ష్మికి భర్త రాములు, ఇద్దరు కూతుళ్లు ఉండగా, రేవతికి పెండ్లి కాగా, రేఖ డిగ్రీ చదువుతున్నది. సంఘటనా స్థలానికి చేరుకున్న లక్ష్మీ భర్త రాములు, కుటుంబ సభ్యు లు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నందిగామలో విషాదం..
రామాయంపేట, డిసెంబర్ 1 : శుభకార్యానికి వెళ్తూ కారు అదుపుతప్పి బావిలో పడిన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన సూదనం భాగ్యలక్ష్మి(55), సూదనం ప్రశాంత్(27) మృత్యువాత పడగా, గ్రామంలో విషాదం నెలకొన్నది. ప్రమాదం జరగడంతోనే విషయం తెలుసుకున్న నందిగామ గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలికి వెళ్లి బోరున విలపించారు. తల్లీకొడుకు ఒకేసారి మృత్యుఒడిలోకి వెళ్లిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రశాంత్ లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా, భాగ్యలక్ష్మి బీడీలు చేస్తూ ఇటీవలే కూతురు పెండ్లి చేసింది. పేద కుటుంబంలో విషాదం నెలకొనడంతో కుటుంబీకులు, గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రి రాములు, కూతుర్లు రేఖ, రేవతిలు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
అక్క కూతురు కోరిక మేరకు వెళ్తూ..
అక్క కూతురు కోరిక మేరకు భాగ్యలక్ష్మి, కొడుకు ప్రశాంత్‌తో కలిసి కారులో బారసాలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నందారం వెళ్తున్నారు. భాగ్యలక్ష్మి అక్క గతేడాది కింద ఆనారోగ్యంతో మృతి చెందింది. అక్క బిడ్డ తనను తీసుకెళ్లమని కోరడంతో బారసాల అనంతరం ఆమెను తీసుకొచ్చేందుకు కొడుకుతో కలిసి వెళ్తున్నది. అంతలోనే ప్రమాదంలో ఇద్దరూ చనిపోవడంతో ఇరుకు టుంబాల్లో విషాదం నెలకొన్నది.
కారు తాడు చిక్కుకొని గజ ఈతగాడి మృతి
రాత్రి 8.30గంటల ప్రాంతంలో కారును బయటకు తీశారు. బావిలో దిగి, కారుకు తాడు కట్టిన గజ ఈతగాడు కారుకు చిక్కుకొని మృతి చెందాడు. కారు తీసే క్రమంలో తల్లీకొడుకుల మృతదేహాలతో పాటు మరో మృతదేహం కనబడగా, అందరూ షాక్‌కు గురయ్యారు. సహాయక చర్యల్లో భాగంగా బావిలో దిగిన దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు నర్సింహులు(42)గా గుర్తించారు. కారుకు తాడు కట్టగా, క్రేన్ సహాయంతో పైకి లేపుతుండగా, తాడు మధ్యలో చిక్కుకొని మృతి చెందాడు. కారుతో పాటు అతని మృతదేహం కూడా పైకి వచ్చి, మళ్లీ బావిలో జారిపోయింది. మళ్లీ అతని ఆచూకీ లభించలేదు.ఈ విషయమై ఎనగుర్తి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళన చేపట్టారు. నర్సింహులు మృతికి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందర్‌రావు, పోలీసులే కారణ మంటూ నిరసన వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.