కోర్టుల సంఖ్య పెరగడంతో లబ్ధి
ప్రభుత్వ చొరవ అభినందనీయం
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమ కోహ్లి
వనపర్తి, జడ్చర్లలో అదనపు కోర్టులు ప్రారంభం
వనపర్తి, జూలై 1 (నమస్తే తెలంగాణ)/జడ్చర్ల టౌన్ : అదనపు కోర్టుల ఏర్పాటుతో బాధితులకు సత్వర న్యాయం అందనుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమకోహ్లి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వర్చువల్ సమావేశంలో వనపర్తి, కొడంగల్, జడ్చర్లలో అదనపు కోర్టులను ప్రారంభించారు. జడ్చర్లలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రత్యక్షంగా మహబూబ్‌నగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా హిమకోహ్లి మాట్లాడుతూ బార్ అసోసియేషన్లు, జ్యుడీషియల్ అధికారుల మధ్య సమన్వయం కలిగి ఉండాలన్నారు. కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులో ఉన్న కోర్టులకు అదనంగా మరో 10 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులతోపాటు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసు కోర్టులు మంజూరైనట్లు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తక్కువ కాలంలో ఇలాంటి కార్యక్రమం రెండోదన్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొనడం అభినందనీయమన్నారు.అంతకు ముందు హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి మాట్లాడారు. కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జడ్చర్ల కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి రఘురాం మాట్లాడుతూ జడ్చర్లలో 4,200 పెండింగ్ కేసులున్నాయని, వాటిలో రాజీపడే కేసులను గుర్తించి లోక్‌అదాలత్‌లో పరిష్కరించాలన్నారు. అంతకుముందు జడ్జి రఘురాం, మహబూబ్‌నగర్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ సీతారామారావు, జడ్చర్ల కోర్టు జడ్జి షాలిని లింగంను జడ్చర్ల బా ర్అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి, బార్ కౌన్సిల్ సభ్యుడు నిరంజన్‌రెడ్డి, వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి, గద్వాల ఏడీజే సంతోష్‌కుమార్, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, వనపర్తి సబ్ జడ్జి ఇందిర, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వర్, ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అలివేలమ్మ, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. జడ్చర్లలో జరిగిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్, జడ్చర్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.శ్రీనివాస్‌గౌడ్, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవేందర్, మాజీ అధ్యక్షులు మాలిక్‌షాకీర్, మహేశ్వర్‌రెడ్డి, సీఐలు వీరాస్వామి, శివకుమార్, రజిత, బాలాజి, ఎస్సైలు షంషోద్దీన్, లెనిన్, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత, న్యాయవాదులు తిరుపతి, ప్రదీప్పాటిల్, మోహన్‌రావు, బార్ అసోసియేషన్ సభ్యులు జంగయ్య, విశ్వేశ్వర్, ఇఫ్తేకార్, పాండు, శ్రీనివాస్‌గౌడ్, పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు.