
మానవ మేధస్సుకు సవాల్ విసురుతున్న ఎయిడ్స్
నైతిక జీవనమే అసలైన మందు అంటున్న నిపుణులు
చేర్యాల టౌన్, నవంబర్ 30: ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య ఎయిడ్స్. ఎంతటి మొండిరోగానికైనా మందు కనుక్కుంటున్న ప్రస్తుత తరుణంలో మానవ మేధాశక్తికి సవాల్ విసురుతూ మందులేని వ్యాధిగా పేరుపొందింది. అయితే ప్రమాదకరమైన ఈవ్యాధిపై సరైన అవగాహన కల్పించాలని 1987 ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న బస్, నెట్టర్ అనే ఉద్యోగులు ప్రయత్నించారు. తరువాతి పరిణామాల్లో భాగంగా సభ్యదేశాలతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 1ను ఎయిడ్స్ నివారణ రోజుగా ప్రకటించింది.
అనేక వ్యాధుల సమూహమే ఎయిడ్స్..
ఎక్వయిర్డ్ ఇమ్యునో డిఫీషియన్సీ సిండ్రోమ్. వ్యాధి కారకశక్తి తగ్గడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన అనేక వ్యాధికారక సూక్ష్మజీవులు కలిగించే సమూహమే ఎయిడ్స్. మానవ శరీరం నిత్యం కోట్ల సంఖ్యలో వ్యాధికారక క్రిములతో యుద్ధం చేస్తుంది. అందులో కొన్ని లక్షల సంఖ్యలో శరీరంలోనికి ప్రవేశించగలుగుతాయి. ఒకవేళ ఈ క్రిములన్నీ ఒకేసారి తమ ప్రభావాన్ని చూపితే మనం కొన్ని గంటలు మాత్రమే బతకగలం. వీటిని ఎప్పటికప్పుడు సంహరిస్తూ రక్షించడానికి మన శరీరంలో అతిబలమైన వ్యాధినిరోధక వ్యవస్థ ఉంటుంది. రక్తంలోని తెల్లరక్తకణాలు ఈ వ్యవస్థకు సారథ్యం వహిస్తాయి. వీటిలోని ఎసిడోఫిల్స్, బెసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్లు, మోనోసైట్లు అనే వేర్వేరు కణాలు నిర్ణీత వ్యాధికారకాలను సంహరిస్తూ దేహాన్ని నిరంతరం రక్షిస్తూ ఉంటాయి. ఐతే ఎయిడ్స్‌ను కలిగించే హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనే సూక్ష్మజీవి లింఫోసైట్లలో జీవిస్తూ వాటినే ఆహారంగా స్వీకరిస్తుంది. ఫలితంగా ఆ కణాల సంఖ్య తగ్గి వ్యాధినిరోధక శక్తి బలహీనమవుతుంది. దీంతో అన్నివ్యాధి లక్షణాలు ఏకకాలంలో కనిపించే స్థితిని ఎయిడ్స్‌గా పరిగణిస్తారు. దీనికి కారణమైనది హ్యూమన్ ఇమ్యూనో వైరస్. తనను తాను రక్షించుకోవడానికి మానవదేహం ఏర్పాటు చేసుకున్న లింఫోసైట్ల పైననే దాడి చేసి వాటిని ఆహారంగా స్వీకరించగలదీ వైరస్. వాడిన మందుల నుంచి తప్పించుకునేలా ఎప్పటికప్పుడు తన రసాయన నిర్మాణాన్ని మార్చుకోగలదు. అందువల్లనే నేటికీ మానవుడు ఈ వ్యాధికి మందు కనుక్కోలేకపోతున్నాడు.
వ్యాప్తి ఎలా..
ఈ వ్యాధి నాలుగు మార్గాల ద్వారా వ్యాపిస్తుందని తేలింది. ఎయిడ్స్ వ్యాధిని కలిగిన వ్యక్తి రక్తాన్ని ఎక్కించడం అందులో మొదటిది. ఎక్కించే ముందు రక్తాన్ని పలుమార్లు పరీక్ష చేయడం ద్వారా వ్యాప్తిని నివారించవచ్చు. వ్యాధితో బాధపడుతున్న వ్యాక్తికి ఉపయోగించిన వైద్యపరికరాలను ఇతరులకు వాడడం రెండోది. అందుకే ప్రస్తుతం డిప్పోజబుల్ వైద్యపరికరాలను వాడుతున్నారు. ఒకవేళ తల్లికి ఈవ్యాధి సోకి ఉంటే ఆమె ద్వారా గర్భస్థ శిశువుకు సంక్రమించడం మూడోది. దీనిని నివారించడానికి జైడోవుడీన్ వంటి ఇంట్రావీనం ఇన్జక్షన్లను వాడుతున్నారు. అనైతిక లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం నాల్గోది. మొదటి మూడు మార్గాల ద్వారా ఈవ్యాధి వ్యాప్తిని నివారించడం చాలా వరకు సాధ్యమైంది. అయితే 90శాతం వ్యాప్తికి కారణమైన నాల్గో మార్గం ద్వారా నియంత్రించడం కేవలం నైతిక జీవనవాధానం ద్వారానే సాధ్యం అవుతుందని నిపుణులు అంటున్నారు.
అవగాహనే సరైన మందు..
జిల్లాలో ఇప్పటి వరకూ 2877 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను గుర్తించాం. వీరికి యాంటీ రిట్రోవైరల్ థెరపీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 1100 మంది బాధితులకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. ఈసారి కొవిడ్ నిబంధన వల్ల సామూహిక అవగాహన సదస్సులు నిర్వహించడం కష్టసాధ్యంగా మారింది. ప్రచార మాధ్యమాలు సామూహిక ప్రదేశాల్లో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో బ్యానర్లను ఏర్పరచడం ద్వారా అవగాహన కలిగించేలా చర్యలు తీసుకుంటున్నాం. సమాజంలో ప్రధానంగా విద్యార్థుల్లో ఎయిడ్స్‌పై అవగాహన కలిగించడానికి పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్ పోటీలు సంబంధిత చిత్రలేఖన పోటీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం.