
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 18: కలెక్టరేట్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులు సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేపట్టనున్నారని, మార్చిలోగా పూర్తి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత అధ్యక్షతన 2,4,7వ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. 7న స్థాయీ సంఘ సమావేశానికి హాజరైన సుభాష్‌రెడ్డి నూతన కలెక్టరేట్ పనుల గురించి ఆర్అండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.పనులు సక్రమంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కలెక్టరేట్ సకాలంలో పూరైయితే సీఎం ప్రారంభోత్సవానికి రానున్నారని ఆయన వెల్లడించారు. జిల్లాలో మిషన్ భగీరథ పనులపై ఆరా తీశారు. జిల్లాలోని ప్రతి పాఠశాలకు, డబుల్‌బెడ్ రూమ్‌లకు భగీరథ నీళ్లు అందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ట్రాన్స్‌కో అధికారుల పనితీరు సరిగా లేదని ట్రాన్స్ టెక్నికల్ డీఈ రాంబాబుపై ఎమ్మె ల్సీ సుభాష్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుంచి పనితీరు మార్చుకోవాలని సూచించారు. నాలుగు నెలల నుంచి మండల సర్వసభ్య సమావేశాలకు ట్రాన్స్‌కో అధికారులు రావడం లేదని నర్సాపూర్ జడ్పీటీసీ అధికారుల దృష్టికి తెచ్చారు. కల్వకుంటలో ట్రాన్స్ఫార్మర్ మార్చడానికి రూ.2 లక్షల అడిగారని నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్ టెక్నికల్ డీఈ రాంబాబు దృష్టికి తీసుకొచ్చారు.
తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి
గ్రామాల్లో ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలని పంచాయతీ అధికారులకు జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ సూచించారు.2వ స్థాయీ సంఘ సమావేశంలోఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశాల్లో జడ్పీ సీఈవో శైలేష్ కుమార్, డిప్యూటీ సీఈవో సుభాషిణి తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు