
వ్యాక్సినేషన్ పూర్తయ్యే దాక సెలవులు రద్దు
అధికారులతో కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 1: ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో వ్యాక్సిన్ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. పీహెచ్‌సీల వారీగా వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించారు. తక్కువ పురోగతి గల సంబంధిత మెడికల్ ఆఫీసర్, ఎంపీడీవో, డిప్యూటీ డీఎం ఆండ్ హెచ్వోలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఒమిక్రాన్‌పై ప్రజలను చైతన్యం చేయాలని, వంద శాతం వ్యాక్సిన్ పూర్తి కావాలన్నారు. వ్యాక్సినేషన్‌పై మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. రెండు డోసులు తీసుకుంటేనే సురక్షితమని అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య విషయంలో జిల్లా సంక్షోభంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామం వారిగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గాయత్రీదేవి ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.