
గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే తొందరో.. మరేదైనా కారణమో తెలియదు గానీ.. ఓవర్‌టెక్ ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో పుట్టెడు విషాదాన్ని నింపింది. శుక్రవారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారి చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న వాహనాన్ని ఓవర్‌టెక్ చేస్తూ, ఎదురుగా వస్తున్న లారీ ముందు భాగంలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతికష్టం మీద మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ఘటనతో మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట, సంగాయిపేట గ్రామాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సంగారెడ్డి జిల్లాకేంద్ర దవాఖానకు మృతదేహాలను తరలించగా, అక్కడ బాధిత కుటుంబీకుల రోదనలు అందరినీ కదిలించాయి.
అందోల్/చౌటకూర్/కొల్చారం, ఆగస్టు 6
ఓవర్‌టెక్ ఐదుగురి ప్రాణాలను మింగింది. రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారి చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దవాఖాన నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో చిన్నారితో పాటు అతడి తల్లిదండ్రులు, తోడుగా వచ్చిన దంపతులు మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామానికి చెందిన పుర్ర అంబాదాస్ (33), పుర్ర పద్మ (25), వారి కొడుకు వివేక్ (6)కు ఆరు రోజుల క్రితం సంగారెడ్డిలోని దవాఖానలో అపెండిక్స్ ఆపరేషన్ అయ్యింది. శుక్రవారం డిశ్చార్జి ఉండగా, అంబాదాస్ సన్నిహితుడు, రంగంపేట్‌కు చెందిన చర్చి పాస్టర్ లూకా (44), ఆయన భార్య దీవెన (41) కారు (ఏపీ28 సీఎల్ 8962)లో దవాఖానకు వచ్చారు. డిశ్చార్జి అనంతరం ఐదుగురు కారులో గ్రామానికి బయలుదేరారు. లూకా డ్రైవింగ్ చేస్తూ చౌటకూర్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవక్టెక్ చేయబోయి, జోగిపేట నుంచి సంగారెడ్డికి వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు ముందుభాగం లారీ క్యాబిన్ కిందకు చొచ్చుకుపోయింది. లూకా, దీవెన, అంబాదాస్, పద్మ, వివేక్ అక్కడికక్కడే మృతి చెందారు. పుల్కల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, అతి కష్టం మీద మృతదేహాలను బయటికి తీసి, సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అందోల్-జోగిపేట ఆర్డీవో విక్టర్, చౌటాకూర్ తహసీల్దార్ కిష్టయ్య, డీటీ మహేశ్ పంచనామా నిర్వహించగా, ఎస్పీ రమణకుమార్, డీఎస్పీ బాలాజీ ఘటనా స్థలంలో స్థానికులతో మాట్లాడి, ప్రమాద కారణాలు తెలుసుకున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పుల్కల్ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్.
ఘోరరోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెంది, రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నదని, ఇది దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
రంగంపేట, సంగాయిపేటలో తీవ్ర విషాదం
కొల్చారం, ఆగస్టు 6 : రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట, సంగాయిపేట గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రంగంపేట చర్చి పాస్టర్ లూకా (దీవెనయ్య), అతడి భార్య దీవెన, సంగాయిపేట గ్రామానికి చెందిన పుర్ర అంబదాస్, పద్మ, వారి చిన్న కొడుకు వివేక్ మృత్యువాత పడడంతో ఆ గ్రామాలు షాక్‌కు గురయ్యాయి. అంబాదాస్-పద్మకు ముగ్గురు సంతానం కాగా, ఏడాది క్రితం అనారోగ్యంతో రెండో కొడుకు మృతి చెందాడు. పెద్దకొడుకు, చిన్న కొడుకు ఉన్నారు. చిన్న కొడుకు వివేక్‌కు అపెండిక్స్ సమస్య వచ్చింది. కాగా, ఆటో నడుపుకొని జీవించే అంబాదాస్‌కు, పాస్టర్ లూకా కుటుంబాలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే వివేక్ డిశ్చార్జి ఉండడంతో లూకా తన సొంత కారులో భార్యతో సంగారెడ్డి దవాఖానకు వెళ్లి, వారిని తీసుకొస్తుండగా, ప్రమాదం జరిగింది. బంధువులు, స్నేహితులు మృతుల ఇంటి వద్దకు చేరుకుని రోదిస్తుండడంతో కలచివేసింది. అంబాదాస్ పెద్దకొడుకు అనాథగా మారాడు.