పటాన్చెరు, డిసెంబర్ 16: విదేశాలకు తీసిపోని రోడ్లను వేస్తున్నామని ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని పటాన్చెరు ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్‌పై నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను మంత్రి కేటీఆర్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అనిత హరినాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా లైట్లన్నీ ఆర్పివేసి కేటీఆర్, మంత్రులు కంప్యూటర్‌తో అటాచ్ చేసిన బటన్లను ప్రెస్‌చేసి ఎల్ఈడీలను ప్రారంభించారు. భారీ స్క్రీన్‌పై ఔటర్ రింగ్‌రోడ్డుపై ఏర్పాటు చేసిన లైటింగ్ వీడియోను ప్రదర్శించారు. పటాకుల వెలుగులో ఔటర్‌రింగ్ రోడ్డు కొత్తందాలను సంతరించుకుంది. వరుసగా ఎల్ఈడీ లైట్లు మిరిమిట్లు గొలుపుతూ వెలగడం అందరినీ ఆకట్టుకున్నది. రోడ్లన్నీ వెలుతురుతో ప్రకాశవంతంగా కనిపించడంతో ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారంతా చప్పట్లతో సంబురపడ్డారు. ప్రారంభోత్సవ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 136 కిలోమీటర్ల మేర కొత్తగా ఎల్ఈడీ లైట్లను వేసినట్లు తెలిపారు. రూ.100.22 కోట్లతో ఎల్ఈడీ స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. 4,538 పోల్స్‌ను, 9,076 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్ల వెలుతురు ఉంటుందన్నారు. మొదటి విడత ఎల్ఈడీ లైట్లను రూ. 30కోట్ల ఖర్చుతో వేశామన్నారు. 270.5 కిలోమీటర్ల మేర సర్వీసురోడ్డు, ఔటర్ రోడ్డును వేశామన్నారు. ఔటర్ రింగురోడ్డును సుందరీకరించడంతో పాటు కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ఓఆర్ఆర్పై ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా మారిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రహదారులను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. సీఎం కేసీఆర్ రీజినల్ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారన్నారు.340 కిలోమీటర్ల రీజినల్ రింగ్‌రోడ్డును ఔటర్‌ను మరిపించేలా వేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది పూర్తి చేస్తారన్నారు. అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గని వ్యక్తిత్వం కేసీఆర్‌దని కొనియాడారు. హెచ్ఎండీఏ అధికారులు చక్కగా పనిచేసి ఓఆర్ఆర్కు అన్ని హంగులు ఏర్పాటు చేశారని మంత్రి అభినందించారు. దేశంలోనే ఇలాంటి రింగ్‌రోడ్డు మరొకటి లేదన్నారు. దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాలకంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్‌రోడ్డే పెద్దది, సౌకర్యవంతమైందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రింగ్‌రోడ్డుపై సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పుడు విదేశాల నుంచి వస్తున్న వారు కూడా ఇక్కడి అభివృద్ధి చూసి పెట్టుబడులు పెడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు కోరుతున్న అభివృద్ధిని, సౌకర్యాలను కల్పించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వం మాదన్నారు. సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కులో బుధవారం 7 కొత్త పరిశ్రమలను ప్రారంభించుకున్నట్లు తెలిపారు. దాదాపు 50 పరిశ్రమలు త్వరలో ప్రారంభం కానున్నాయని, తద్వారా ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. అభివృద్ధితో స్థానికులకు అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో 80వేల ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చిందన్నారు.అక్కడ పరిశ్రమలను ఆహ్వానించేందుకు అవకాశం లభించిందన్నారు.
కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్‌జీసీఎల్ ఎండీ సంతోష్, చీఫ్ ఇంజినీర్ హెచ్ఎండీఏ బీఎల్ ఎన్ రెడ్డి, వైస్ జడ్పీ చైర్మన్ కుంచాల ప్రభాకర్, ఎంపీపీలు సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, అమీన్‌ఫూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్, జడ్పీటీసీ సుప్రజా వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, కొలన్ రోజా బాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, సింధూ ఆదర్శ్‌రెడ్డి, పుష్పనాగేశ్యాదవ్,టీఆర్ఎస్ యువత రాష్ట్ర నాయకులు వెంకటేశంగౌడ్, వైస్ ఎంపీపీ నందారం నర్సింహాగౌడ్, స్వప్న శ్రీనివాస్, నీనారెడ్డి, సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్, రుద్రారం సర్పంచ్ సుధీర్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, మన్నెరాజు, టీఆర్ఎస్ నాయకులు నగేశ్, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, యూనుస్, అఫ్జల్, మానిక్‌రెడ్డి, మెరాజ్‌ఖాన్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మినీ ఇండియా ఇక్కడే ఉంది..
పటాన్చెరు నియోజకవర్గం అంటేనే మినీ ఇండియా అని. 28 రాష్ర్టాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల ఖర్చుతో ఎల్ఈడీ లైట్లను ఔటర్ రింగ్‌రోడ్డుపై ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. ఎల్ఈడీ వెలుగులతో రాత్రిళ్లు రోడ్డు ప్రమాదాలు అడ్డుకట్ట పడతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్ కారణంగానే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. రింగు రోడ్డు రావడంతో మా ప్రాంతం శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు తెలిపారు. సుల్తాన్ఫూర్లో ప్రారంభించిన పరిశ్రమలతో పటాన్చెరు ప్రాంతానికి కొత్త గుర్తింపు వచ్చిందన్నారు. గతంలో కాలుష్యంతో సావాసం చేసిన ఈ ప్రాంతంలో ఇప్పుడు కొత్త వెంచర్లు, అపార్టుమెంట్లు వస్తున్నాయని ఎమ్మెల్యే సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగులు కూడా తెల్లాపూర్, అమీన్‌ఫూర్, బొల్లారంలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. విల్లాలు ప్రారంభమవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అభివృద్ధి జరుగుతున్నదని, తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో గమనించినట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు.