చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్‌పై ఫేస్బుక్ వేదికగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ పాటలోని సాహిత్యం అర్థంలేకుండా ఉందని యండమూరి ఓ పోస్ట్ చేశారు. పాటలోని కొన్ని పంక్తులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే..తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే’ అనే పంక్తిని ఉదహరిస్తూ ‘తిమిరము’ అంటే అర్థం తెలుసా? శివదూషణ కాదా ఇది? ఎవరు రాశారో కానీ ఏమిటీ పిచ్చి రాతలు? అంటూ యండమూరి వీరేంద్రనాథ్ పోస్ట్ చేశారు. ఆయన మాటలకు చంద్రబోస్ గట్టిగా బదులిచ్చారు.
తెలుగు అలంకారాల మీద సంపూర్ణ అవగాహనతో తాను ఆ పాట రాశానని, అధ్యయనం చేయాల్సిన గీతమిదని చంద్రబోస్ చెప్పారు. విరోధభాసాలంకారాన్ని ఉపయోగిస్తూ ఆ పాటను రాశానని.. పరస్పర విరుద్ధమైన రెండు పదాలు కలయికను లోతుగా పరికిస్తే విరోధం తొలగిపోయి ఆ పదబంధం లోతు తెలుస్తుందని చంద్రబోస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ ప్రముఖ రచయిత సత్యానంద్ ఫోన్ చేసి సాహిత్యపరంగా అధ్యయనం చేయాల్సిన గీతమిదని ప్రశంసించారు.
పాటలోని కొన్ని పంక్తుల పట్ల యండమూరిగారు అభ్యంతరం తెలిపారు. అయితే వాటిని నేను విరోధభాసాలంకారంలో రాశాను. హిమజ్వాల, మౌనశంఖం అనే పదాలు పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి కానీ తరచి చూస్తే ఓ గంభీరమైన, లోతైన భావాన్ని స్ఫురింపజేస్తాయి. విరోధభాసాలంకారానికి ఉన్న ప్రత్యేకత అదే. ఈ పాటలో నేను ఎక్కడా శివదూషణ చేయలేదు. ఎలాంటి ఆక్షేపణలు చేయకుండా నిజంగా అధ్యయనం చేయాల్సిన పాట ఇది’ అని చంద్రబోస్ పేర్కొన్నారు.