భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 27 : ఇంటర్మీడి యట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్హాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మే 6 నుంచి 24 వరకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రథమ సంవత్సరంలో 7,124 మంది పరీక్ష రాయనుండగా ఇందులో 5,536 మంది జనరల్, 1,588 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. సెకండియర్‌లో 7,018 మంది ఉండగా జనరల్ 5,526, ఒకేషనల్ 1,492 మంది పరీక్ష రాయనున్నారన్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీకి 2 ఫ్లయింగ్ స్కాడ్, 3 సిట్టింగ్ స్కాడ్ బృందాలను నియమించినట్లు చెప్పారు.
పోలీసు శాఖ పరిధిలో గుర్తించిన భద్రతా కేంద్రాల్లో పరీక్షల పత్రాలు, సామగ్రి భద్రపర్చనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూసి వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడిపించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు భూపాల్‌రెడ్డి, సూరజ్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నరసింహ, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శిల్పి, డీపీఆర్ఓ వెం కటేశ్వరరావు, ఆర్టీసీ డీఎం లక్ష్మారెడ్డి, విద్యుత్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాల సేకరణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఏఈలతో పల్లెప్రగతి, ఉపాధిహామీ పనుల పురోగతిపై సమీక్షించారు. బృహత్ పల్లెప్రకృతి వనాలకు ప్రతి మండలంలో కనీసం 5 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని, స్థల సేకరణ జరుగని చోట వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటాల్సిన ప్రదేశాలను గుర్తించి అంచనాలు తయారు చేయాలని, వర్షాలు ప్రారంభం కాగానే గుంతలు తీసి మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ ఎం. ఉపేందర్‌రెడ్డి, డీపీఓ సునంద, అడిషనల్ డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.