జిల్లా కేంద్రంలో చిన్నపిల్లల కోసం అత్యాధునిక వసతులతో చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ.17 కోట్లు కేటాయించగా 1.20 ఎకరాల్లో నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో స్థల పరిశీలన చేసి నిర్మాణాలు చేపట్టేందుకు అడుగులు పడుతున్నాయి. ఇక ఏరియా దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాట్లు చకచకా జరుగుతుండగా ల్యాబ్‌లో పరికరాలు, ఏసీల ఏర్పాటుకు ఎమ్మెల్యే తన సొంత నిధులు రూ.6లక్షలు అందించారు.
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా రూ.17 కోట్లతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి పట్టణంలో వరంగల్-హైదరాబాద్ బైపాస్ రోడ్డులో 1.20 గుంటల స్థలంలో దీనిని నిర్మించనున్నారు.
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో స్థల పరిశీలన చేసిన అనంతరం దవాఖాన నిర్మాణ పనునలు ప్రారంభించనున్నారు.ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధునాతన పరికకాలు ఏర్పాటు చేయడంతో పాటు అదనపు వార్డులు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
దవాఖానలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ల్యాబ్ పరికరాల కొనుగోలుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.6లక్షలు కేటాయించడంతో పాటు రోగుల గదుల్లో రెండు ఏసీల ఏర్పాటుకు సైతం సొంత నిధులు అందించారు. ఏరియా దవాఖానలో డయాలసిస్ సేవలు ప్రారంభించాలని ఇటీవల ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరగా అందుకు ప్రభుత్వం అనుమతించింది. దాంతో ప్రస్తుతం డయాలసిస్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. దవాఖానలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగనున్నది.
జిల్లా కేంద్రంలో రూ.17 కోట్లతో పిల్లల దవాఖాన ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎమ్మెల్యే ఆదేశాలతో త్వరలో స్థల పరిశీలన చేపడుతాం. ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తుండడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మేలు కలుగనున్నది. దవాఖానలో మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారు. ఇటీవల అనుమతిలేని ల్యాబ్, ప్రైవేటు దవాఖానలను వైద్యాధికారులు సీజ్ చేశారు. దవాఖానలోనికి ప్రైవేటు వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకున్నాం.
– ఎన్నబోయిన ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్
జిల్లా కేంద్రంలో చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని త్వరలో పరిశీలిస్తాం. ఈ ఆస్పత్రి ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు మరింత మెరుగైన వైద్యం అందనున్నది. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ ఏర్పాటు చేయడం వల్ల కిడ్నీ రోగులకు ఉపశమనం కలుగనున్నది. దాంతో పాటు ఏరియా ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం.
– ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి