
గత పదేండ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు
జిల్లా వ్యాప్తంగా 1,005 చెరువులకు జలకళ..
మత్తడిదుంకుతున్న 106 చెరువులు
వానకాలంలో 4.42 లక్షలఎకరాల లక్ష్యాన్ని మించిసాగుకానున్న పంటలు
ఈ నెలలో 39 శాతం అధికంగా వర్షపాతం నమోదు
ప్రస్తుత వర్షాలతో అన్ని రకాల పంటలకు ఉపయుక్తం
నీటి కష్టాలు తొలగిపోయినట్లేనని సంబురపడుతున్న రైతాంగం
జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నెలలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, చెరువులు, కుంటలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని 1,005 చెరువులు జలకళను సంతరించుకోగా..106 చెరువులు మత్తడిదుంకుతున్నాయి. దీనికితోడు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుత వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తుండగా..లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీటితో ఆయా ప్రాంతాల ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత పదేండ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాలు పంటలకు మేలు చేయగా..వానకాలం సాగు లక్ష్యం 4.42 లక్షల ఎకరాలకు మించి పంటలు సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విస్తార వర్షాలతో ఈ ఏడాది పంటలకు ఢోకా ఉండదన్న ధీమాను రైతాంగం వ్యక్తం చేస్తోంది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ఈ ఏడాది వానలు దంచికొడుతున్నాయి. దీనికితోడు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అదే విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మూసీ పరవళ్లు తొక్కుతుండగా.. గోదావరి జలాలు సైతం ఉధృతంగా జలాశయాల్లోకి చేరుతున్నది. కరువు ప్రాంతమైన జిల్లాలో గత పదేండ్లలో ఎన్నడూలేని స్థాయిలో ఈసారి నీటి లభ్యత కనిపిస్తోంది. పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో జిల్లాలో ఊహించని రీతిలో పంటలు సాగవుతున్నాయి. వానకాలంలో 4.42లక్షల ఎకరాల్లో పంటల సాగుకు లక్ష్యాన్ని విధించగా.. ఇప్పటికే సింహభాగంలో పంటల సాగు పూర్తయింది. వరి అంచనాలకు మించి సాగు కానుండగా.. పత్తి, కందులు వంటి పంటలకు సైతం ప్రస్తుత వర్షాలు ఉపయుక్తంగా మారాయి.
రికార్డుస్థాయిలో కురుస్తున్న వర్షాలు
విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవుతున్నది. ఈ ఏడాది జూన్ నుంచి జూలై వరకు జిల్లా సాధారణ వర్షపాతం 269.8మి.మీ.లకు గాను 459.9మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 70 శాతం అధికంగా వర్షం కురిసింది. ఒక్క జూలై నెలలోనే 169.23మి.మీ.ల వర్షపాతానికి మించి 76శాతం అత్యధికంగా 298.1మి.మీ.లుగా నమోదైంది. జిల్లా ఏర్పాటు తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం. అయితే గత పదేండ్లలో చూడని వర్షపాతం, 30 ఏండ్లలో చూడని వరదను జూన్, జూలై నెలల్లో జిల్లావాసులు చవిచూశారు. 400.3 మి.మీ.ల సాధారణ వర్షపాతానికి గాను 557.1 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అంటే 39 శాతం అత్యధికంగా వానలు కురిశాయి. ప్రస్తుతం పడుతున్న వర్షాలు గత రికార్డులను అధిగమించడంతో జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు సైతం నిండుతున్నాయి. జిల్లాలో మొత్తం 1,005 చెరువులు ఉండగా, 25శాతం లోపు 139 చెరువులు, 50 శాతం లోపు 251 చెరువులు, 75శాతం లోపు 244 చెరువులు, వంద శాతం మేర 265 చెరువులు జలకళను సంతరించుకోగా, 106 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. చెరువుల్లోకి త్వరలోనే ప్రభుత్వం చేప పిల్లలను వదలనుండటంతో మత్స్య కార్మికులకు సైతం ఏడాది పొడవునా ఉపాధి దొరకనున్నది.