
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో యువతకు వివిధ వృత్తుల్లో నైపుణ్యతను పెంపొందించే దిశగా యువజన సర్వీసుల శాఖ చర్యలు చేపడుతున్నది. ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబాల్లోని యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అధికారులు వాసాలమర్రిలోనే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రెండుమూడు రోజుల్లో ప్రారంభమయ్యే ఈ శిక్షణలో తొలుత ఐదు రకాల కోర్సుల్లో 250మందికి జీవనోపాధి పొందే విధంగా తర్ఫీదు ఇవ్వనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వాసాల మర్రి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దత్తత గ్రామం వాసాలమర్రిలో జీవనోపాధులపైనే సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని వాసాలమర్రిలోనే తొలుత ప్రారంభించి 76 కుటుంబాలకు రూ.10లక్షల సాయం అందించేందుకు సంకల్పించారు. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి లబ్ధిదారులకు ఏ ఏ యూనిట్లపై ఆసక్తి ఉందో అడిగి తెలుసుకున్నారు. శాశ్వతంగా ఉపాధి పొందేలా యూనిట్లను ఎంపిక చేసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడు రూ.10లక్షలతో రెండు, మూడు యూనిట్లను సైతం ఏర్పాటు చేసుకునేలా వారిని చైతన్యపరుస్తున్నారు. త్వరలోనే యూనిట్ల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుండగా, లబ్ధిదారులకు ఆయా యూనిట్లపై నైపుణ్యత పెంపొందించేలా శిక్షణా కార్యక్రమాలను చేపట్టనున్నారు. అదేవిధంగా వాసాలమర్రి గ్రామంలోని యువతకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది.
డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఉపాధి..
ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ఆధారపడే రంగాలనే ఎంపిక చేసి వాటిల్లో శిక్షణ ఇచ్చేందుకు యువజన సర్వీసుల శాఖ చర్యలు తీసుకుంటున్నది. ప్రజలకు అవసరమయ్యే వాటిని గుర్తించి వాటిల్లో శిక్షణ ఇచ్చినట్లయితే మున్ముందు సులభంగా ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని ఆ శాఖ భావిస్తున్నది. ఈ క్రమంలోనే మొబైల్ సర్వీస్, టైలరింగ్, ఎలక్ట్రీషియన్, బ్యూటీషియన్, కంప్యూటర్ తదితర డిమాండ్ ఉన్న కోర్సులను ఎంపిక చేసి వాసాలమర్రి గ్రామ యువతకు శిక్షణ ఇస్తున్నది. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేయనున్నారు. దీనివల్ల బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకు రానుండటంతో యువతీ యువకులు తాము శిక్షణ పొందిన రంగంలో జీవనోపాధి పొందే అవకాశం ఉంటుంది. దళితబంధు పథకంలో భాగంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి సైతం ప్రస్తుత శిక్షణ దోహదపడనున్నది. వాసాలమర్రిలో ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణా కేంద్రాన్ని రెండుమూడు రోజుల్లో ప్రారంభించే దిశగా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. దత్తత గ్రామంలో సీఎం కేసీఆర్ యువతను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న కార్యక్రమాలతో స్థానిక యువతీయువకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
తుర్కపల్లి, ఆగస్టు 19 : సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వశక్తితో ఎదగాలి. గ్రామంలో మొత్తం ఐదు కోర్సులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ కోర్సుల్లో 250 మందికి 3నెలలపాటు శిక్షణ ఇవ్వడంతోపాటు సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. నిరుద్యోగ యువత ఖాళీగా ఉండకుండా శిక్షణ పొంది భవిష్యత్‌లో మరికొంత మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలి.
స్వశక్తితో ఎదగాలనే శిక్షణ
తుర్కపల్లి, ఆగస్టు 19 : శిక్షణ పొంది స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో టైలరింగ్‌లో శిక్షణ పొందాలనుకుంటున్నాను. 3 నెలల పాటు అందించే ఈ శిక్షణకు క్రమం తప్పకుండా వెళ్లి టైలరింగ్‌లో మెలకువలు నేర్చుకొని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తాను.
తుర్కపల్లి, ఆగస్టు 19 : ప్రస్తుత పరిస్థితిల్లో మొబైల్ మెకానిక్కు ఉన్న ఆదరణతోనే ఆ కోర్సులో శిక్షణ పొందాలనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతి వ్యక్తి మొబైల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. అందులో శిక్షణ పొందడం వల్ల భవిష్యత్‌లో ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుంది. ఎక్కడైనా పనిచేసుకొని ఆర్థికంగా ఎదగవచ్చనే ఈ శిక్షణకు మొగ్గు చూపాను.
భవిష్యత్ కంప్యూటర్ కాలమే
తుర్కపల్లి, ఆగస్టు 19 : ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రపంచం మొత్తం కంప్యూటర్‌నే వాడాల్సిన పరిస్థితి. కంప్యూటర్ కోర్సు తీసుకోవడం ద్వారా రానున్న కాలంలో ఎక్కడైనా ఉద్యోగం పొందే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేశాను. ప్రభుత్వం ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం ఎంతో గొప్ప విషయం.