
ఆత్మకూరు(ఎం), ఆగస్టు 12: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామం ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతున్నది. గ్రామంలో 1300 మంది జనాభా ఉండగా..540 మం ది ఓటర్లు, 168 ఇండ్లు ఉన్నాయి. గ్రామస్తుల అవసరా ల నిమిత్తం ప్రభుత్వం గ్రామంలో రూ.12 లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2లక్షల 50వేలతో డంపింగ్ యార్డు, రూ.లక్ష 50వేలతో పల్లె ప్రకృతివనాన్ని ఏర్పా టు చేసింది. గ్రామాభివృద్ధికి సర్పంచ్, వార్డుసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు.
హరితహారంతోపాటు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ఇంటింటికీ 600ల మొక్కలు పంపిణీ చేశారు. ప్రధాన వీధుల వెంట 2 వేల మొక్కలను నాటి సంరక్షించడంతో అవి నేడు ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళకలాడుతున్నాయి. ఒక ఎకర స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో రెండు వేల మొక్కలను నాటగా అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అదేవిధంగా ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడంతోపాటు వీధులు, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చడంతో నేడు ఎటుచూసినా గ్రామం పరిశుభ్రంగా కనబడుతున్నది.
పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం గ్రామానికి కేటాయించిన నిధులతో స్థానికుల అవసరాలకోసం రూ.16 లక్షల 60 వేలతో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. పాత ఇండ్లను పూడ్చివేసి చదును చేయడంతో గ్రామం పరిశుభ్రంగా మా రింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో గ్రామస్తుల అవసరాల కోసం మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి కృషి చేస్తా.
-ఆకుల సరిత సర్పంచ్ ఉప్పలపహాడ్
ప్రతిరోజూ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడంతో పాటు మురుగు కాల్వలతోపాటు వీధులను శుభ్రపర్చడంతో గ్రామం పరిశుభ్రంగా కనబడుతున్నది. గ్రామంలోని అన్ని చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి వీధి లైట్లు అమర్చడం ఎంతో ఉపయోగకరంగా మారింది.
-పిల్లల మర్రి భాగ్యమ్మ గ్రామస్తురాలు
హరితహారంతోపాటు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో నాటిన మొక్కలను సంరక్షించడంతో నేడు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. పల్లె ప్రకృతివనంలో నాటిన రెండు వేల మొక్కలు ఏపుగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ మున్ముందు కూడా మొక్కలను నాటి సంరక్షించి గ్రామాన్ని పచ్చదనం చేయాలి.
-ఆకుల యాకుబ్ గ్రామస్తుడు