
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 10 : జిల్లాలో నెల రోజులపాటు బాలకార్మికులను గుర్తించడానికి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ ముగిసింది. పోలీస్, కార్మిక, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కార్యాచరణ రూపొందించుకొని ఆపరేషన్ ముస్కాన్-7 నిర్వహించారు. జిల్లాలో జిల్లా పరిరక్షణ విభాగం, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో డివిజన్ వారీగా ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు పురుష కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను గుర్తించి, విస్తృత తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జోన్ పోలీస్ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.
ఈ ఆపరేషన్ ముస్కాన్ -7 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 24మంది బాలలను గుర్తించారు. వీరిలో 13మంది బాలికలు, 11మంది బాలురు ఉన్నారు. ఇందులో 10 మంది ఇతర రాష్ర్టాలకు చెందిన వారు కావడంతో వారి స్వస్థలాలకు పంపించారు. జిల్లాకు చెందిన 14 మందిలో 11 మందిని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించారు. మిగతా ముగ్గురు అనాథ బాలలు కావడంతో వారిని బొమ్మలరామారం మండలంలోని గ్రేట్ కమిషన్ మినిస్ట్రీలో చేర్పించారు. అయితే ఈ గుర్తించిన బాలబాలికల్లో ఎక్కువగా చౌటుప్పల్‌లోని పరిశ్రమలు, యాదగిరిగుట్టలోని లాడ్జీల్లో పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం మారడం లేదు. అయితే ఇలా నిబంధనలకు విరుద్ధంగా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో యాదగిరిగుట్టలోని లాడ్జీల నిర్వాహకులు, బొమ్మల దుకాణాల నిర్వాహకులు, చౌటుప్పల్‌లోని పలు పరిశ్రమలు, భువనగిరి కోళ్ల ఫారాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే వారిపైన కేసులు నమోదు చేస్తాం. పిల్లలంతా పనిలో కాకుండా బడిలో ఉండి బాగా చదువుకునేలా అందరం ప్రోత్సహించాలి. ఎక్కడైనా పిల్లలు పనిలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. 18 ఏండ్ల లోపు బాలలతో ఎలాంటి పని చేయించుకున్నా అది బాలకార్మికుల కిందికే పరిగణించబడుతుంది.
బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే అది చట్టరీత్యా నేరం. బస్టాండ్ల వద్ద, రైల్వే స్టేషన్, ఫ్యాక్టరీలు, కిరాణా దుకాణాలు, ధాబాలు, హోటళ్లు, అన్ని రకాల వ్యాపార సంస్థల్లో చిన్నారులు పని చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు గానీ, బాలల పరిరక్షణ సమితి సభ్యులకు గానీ సమాచారం అందించాలి. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించుకున్నాం. ప్రతి ఒక్కరూ బాలల హక్కులను పరిరక్షించాలి.