
చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ఇవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గోదావరి, మూసీ పరవళ్లతో సాగుకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి. ఆగిఆగి పోసే బోర్లు నిరంతరాయంగా పంటలకు నీరందిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గతంతో పోలిస్తే భూగర్భజలాలు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 12 అడుగుల లోతులోనే లభ్యమవుతున్నాయి. 25 మీటర్ల పాతాళంలో ఉన్న జలాలు సంస్థాన్ నారాయణపురం మండలంలో ఈ ఏడాది ఊహించని రీతిలో ఏకంగా 12.58 మీటర్లకు పెరిగి 12.26 మీటర్ల లోతులోనే భూగర్భ జలాల లభ్యత ఉన్నట్లు భూగర్భ జలశాఖ నివేదిక చెబుతోంది. మిగతా 16 మండలాల్లోనూ 1.08 మీటర్ల నుంచి 12 అడుగుల లోతులోనే జలాలు అందుబాటులోకి వచ్చాయి. 2016లో యాదాద్రి భువనగిరి జిల్లా కొత్తగా ఏర్పాటు అయ్యాక ఈ ఏడాది జూలైలోనే రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాతాళగంగ ఉబికి పైపైకి వచ్చింది. జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జూన్ నుంచి జూలై వరకు జిల్లా సాధారణ వర్షపాతం 269.8మి.మీ.లకు గాను 459.9మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 70శాతం అధికంగా వర్షం కురిసింది. ఒక్క జూలై నెలలోనే 169.23మి.మీ.ల వర్షపాతానికి మించి 76శాతం అత్యధికంగా 298.1మి.మీ.లుగా నమోదైంది. జిల్లా ఏర్పాటు తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం. గత పదేండ్ల కాలంలో ఈ రీతిన వర్షాలు కురవక సాధారణ వర్షపాతానికి కాస్త అటూఇటూగా నమోదవుతున్నది. అయితే గత పదేండ్లలో చూడని వర్షపాతం, 30 ఏండ్లలో చూడని వరదను జూన్, జూలై నెలల్లో జిల్లా వాసులు చవి చూశారు. విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం చెరువులు 1,382 నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి భూ ఉపరితలానికి సమీపంలోనే నీరు పుష్కలంగా లభిస్తోంది. దీంతో బోర్లు, బావులన్నీ రీఛార్జి అయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒకప్పుడు జిల్లాలో ఉన్న తాగు, సాగు నీటి ఇబ్బందులు ప్రస్తుతానికి లేకుండా పోయాయి.
తెలంగాణ ప్రభుత్వం గత నాలుగైదేండ్లలో నీటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలు ఫలించడంతో జిల్లాలో గతంలో కంటే పరిస్థితులు మెరుగుపడ్డాయి. మిషన్ భగీరథతో చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడం.. ఉపాధిహామీ పథకంలో నీటి నిల్వకు సంబంధించిన పనులను విరివిగా చేపట్టడం.. ఇంకుడు గుంతల ఏర్పాటుతో ప్రజల్లో వచ్చిన చైతన్యం తదితర పరిస్థితులు.. భూగర్భ జలాలు పెరగడానికి కారణమయ్యాయి. ఒకప్పటి కరువు పరిస్థితులు క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. మూసీ పరవళ్లకు తోడు గోదావరి జలాలు సైతం జిల్లాకు రావడం కొంతవరకు కలిసొచ్చింది. 24 గంటల కరెంటు.. పెట్టుబడి సాయం వంటి పథకాలు పంటల సాగులో రైతులకు తోడ్పాటునందిస్తుండటంతో ఊహించని రీతిలో ఈ ఏడాది పంటలు సాగవుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో జిల్లాలో వానకాలం పంటల సాగు జోరుమీదుంది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 4.42 లక్షల ఎకరాలుగా జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేయగా.. ఇప్పటికే 3.25 లక్షల ఎకరాల్లో పంటల సాగు పూర్తయ్యింది. అయితే వరి తర్వాత అధిక శాతం రైతులు పత్తి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. మూసీ, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరి పంటను రైతులు సాగు చేసుకుంటుండగా, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తిని సాగు చేసేందుకే ఆస్తి కనబరుస్తున్నారు. వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 1.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా ఉండగా, ఇప్పటికే 1.20 లక్షల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఇంకా లక్ష ఎకరాల్లో నాటేందుకు నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈసారి అంచనాలకు మించి వరి సాగు అవుతోంది. 1.74లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా, ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పత్తి సాగు మొదలైంది. రైతుల్లో వచ్చిన చైతన్యం ఫలితంగా నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలనే రైతులు ఎక్కువగా సాగు చేస్తూ వస్తున్నారు. ఏదిఏమైనా పెరిగిన భూగర్భ జలాలు గొప్ప వరంగా జిల్లా రైతాంగం భావిస్తోంది.
జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవ్వడంతోపాటు ప్రభుత్వం నీటి సంరక్షణకు చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఈ స్థాయిలో గతంలో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగిన సందర్భాలు లేవు. కరువుకు మారుపేరైన నారాయణపురం మండలంలోనూ భూగర్భ జలాలు పైపైకి రావడం శుభ సూచికం. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవు.