
మనోహరాబాద్, జనవరి 14 : భూమినే నమ్ముకుని.. జీవితాంతం వ్యవసాయం చేస్తూ నిత్యం శ్రమిస్తాడు రైతన్న. పంట వేసినప్పటి నుంచి అది చేతికొచ్చే వరకు ఎన్నో అవస్థలు పడతాడు. ఎంత కష్టమొచ్చినా.. ఎన్నిసార్లు నష్టమొచ్చినా సడలని ధైర్యంతో ముందుకు సాగుతూనే ఉంటాడు. అయితే, కొంతమంది రైతులు ఆధునిక పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పంటలు పండిస్తుండగా, మరికొంత మంది పాతతరం పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. ఏ విధానాన్ని పాటించినా అందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపుతీత. ఒక్కసారి కలుపు పెరగడం మొదలైతే పంటను ఎదగనియ్యదు. కలుపు నివారణకు ప్రధానంగా ఎడ్లతో దంతె పట్టడం… కూలీలతో కలుపు తీయించడం చేస్తుంటారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో దంతె పట్టాలంటే ఖర్చుతో కూడిన పని. జంట ఎద్దులు కొనాలంటే రూ. 80 వేల పైచిలుకు ఖర్చు అవుతుంది. అద్దెకు దంతె పట్టాలంటే ఎకరానికి వెయ్యి రూపాయల వరకు అవుతుంది. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఆర్థికంగా భారమైన విషయం. కూలీలతో కలుపు తీయాలంటే ప్రస్తుతం గ్రామాల్లో కూలీల కొరత వేధిస్తున్నది. ఒకవేళ కూలీలు దొరికినా కూలి చెల్లింపులు అధికంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో సమయం ఆదా చేయడంతో పాటు కూలీల కొరతను అధిగమించాలి. ఈ ఆలోచనతోనే వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్న నర్సింహాచారి తక్కువ ఖర్చు, కాలం చెల్లిన వస్తువులతో అద్భుతమైన కలుపుతీత యంత్రాలను తయారుచేస్తూ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు.
ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి యంత్రాల తయారీ వరకు..
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన ఎస్.నర్సింహాచారి డిప్లొమా పూర్తి చేశాడు. రైతు కుటుంబంలో పుట్టిన నర్సింహాచారి చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. వివాహం అనంతరం తనకు వచ్చిన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూనే వెల్డింగ్ పని నేర్చుకున్నాడు. పలు సందర్భాల్లో దిగుబడి కంటే పెట్టుబడులు అధిగమవుతుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో, 12 ఏండ్ల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్‌కు వచ్చి వెల్డింగ్ దుకాణం పెట్టుకొని స్థిరపడ్డాడు. అయితే, వ్యవసాయంలో తాను ఎదుర్కొన్న కష్టాలు మరే రైతుకు రానివ్వొద్దని నిర్ణయించుకున్నాడు. ప్రధాన సమస్య అయిన కూలీల కొరతను అధిగమించాలనుకున్నాడు. కాలం చెల్లిన వస్తువులు, మోటారు సైకిళ్లతో కలుపు తీసే యంత్రాలను తయారుచేస్తూ పేద, మధ్య తరగతి రైతులకు ఆసరాగా నిలుస్తున్నాడు. మొ దట్లో పాత సైకిళ్లతో యంత్రాలను తయారు చేశాడు. తర్వాత కాలంలో వాటికి మార్పులు చేస్తూ మోటారు సైకిళ్లతో దంతె పట్టడం, దున్నడం వంటి యంత్రాలను తయారు చేస్తున్నాడు.
భూమిని బట్టి ఎకరాకు రూ. 150 ఖర్చు..
మొదట నర్సింహాచారి సైకిల్ దంతెలను తయారు చేశాడు. వాటితో కలుపు తీయాలంటే సులవైన పని అయినప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో, యంత్ర సహాయంతో నడిచే కలుపు తీత పరికరాల తయారీపై దృష్టిసారించాడు. మోటరు సైకిళ్లకు వెనుక తాత్కాలికంగా పరికరాన్ని అమర్చి, కలుపు తీత అనంతరం తొలగించే విధంగా దంతెను రూపకల్పన చేశాడు. దీంతో రైతుకు శ్రమ తగ్గడమే కాకుండా పని కూడా తక్కువ సమయంలో పూర్తవుతుంది. కాగా, మోటరు సైకిల్ లేని నిరుపేద రైతుల కోసం పాత ఇనుప సామాన్ల దుకాణంలో దొరికే ఇనుప కడ్డీలు, పాత టైర్లతో యంత్రాన్ని తయారు చేశాడు. దీనికి కాలం చెల్లిన చేతక్ ఇంజిన్‌ను బిగించాడు. దీంతో భూమిని బట్టి కలుపు తీసేందుకు రూ. 100 నుంచి రూ. 150 వరకు ఖర్చు వస్తుంది. దీనికి రూ. 18 వేల వరకు ఖర్చు వస్తుందని, ఇవి బురదలో పని చేయవని చెబుతున్నాడు నర్సింహాచారి. మక్క, పత్తి, వేరుశనగ, కూరగాయలు, టమాట, మిర్చి, చెలక పొలంలో ఇబ్బంది లేకుండా పది మంది చేసే పని ఈ ఒక్క యంత్రం చేస్తుందని తెలిపాడు. సైకిల్ దంతెను పాత సైకిల్ తెచ్చుకుంటే రూ. 1200, మొత్తం తనదే అయితే రూ. 1800లకు తయారు చేస్తానని తెలిపాడు.
ప్రభుత్వం సాయం చేస్తే కొత్త యంత్రాలు తయారు చేస్తా..
చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పెరిగాను. వ్యవసాయంపై ఆసక్తి ఉనప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెల్డింగ్ పని నేర్చుకున్నాను. రైతులు పడే కష్టాలు నాకు బాగా తెలుసు.. అనుభవించాను కూడా. కూలీల కొరతను అధిగమించేందుకు దంతె యంత్రాలను తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నా. ఇంకా కొత్తగా యంత్రాలు తయారుచేయాలని ఉన్నా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం సాయం చేస్తే కొత్త యంత్రాలను తయారు చేసి రైతులకు తక్కువ ఖర్చుతో అందిస్తా.
-ఎస్. నర్సింహాచారి, వెల్డింగ్ దుకాణం యజమాని, తూప్రాన్(మెదక్ జిల్లా)