
శ్రీశైలం, జనవరి 16: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే పర్వదినాన ఆలయ ప్రాకారంలోని గోకులంలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఐదో రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను కైలాస వాహనంపై అధిష్టింపజేసి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మహిళలతోపాటు భక్తులు భాగస్వాములయ్యారు. నందివాహన సేవలో భక్తులు అధక సంఖ్యలో పాల్గొన్నారు.
చెంచుల సమక్షంలో కల్యాణం
గిరిపుత్రుల ఆరాధ్య ధైవమైన ఆదిదంపతులకు గిరిజన సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవ కల్యాణాన్ని ఘనంగా జరిపించారు. శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నిత్యకల్యాణ మండపంలో కనుల పండువగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లోని గిరిజన తండాల్లోని చెంచు భక్తులు తరలివచ్చారు. చెంచు సంప్రదాయం ప్రకారం వెదురు బియ్యం, పుట్టతేనె, ఆభరణాలు సమర్పించిన అడవి పుత్రులకు వేదాశీర్వచనాలు అందజేశారు. దేవస్థానం తరఫున మగవారికి పంచ, కండువా, ఆడవారికి రవిక, చీరలను అందించినట్లు ఈవో లవన్న తెలిపారు.