యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ‘ఖాకీ యూనిఫాం’కల నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఒకేసారి 16,614 పోస్టులకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయగానే యువతీయువకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పోలీస్ కొలువుల కోసం ఇప్పటికే కఠోర సాధన చేస్తున్న అభ్యర్థుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.
వారిలో కచ్చితంగా ‘యూనిఫాం’ వేసుకుంటామనే ధీమా కనిపిస్తున్నది. మాట నిలబెట్టుకున్న టీఆర్ఎస్ సర్కారుపై ప్రశంసల వాన కురుస్తున్నది. ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ‘మన కొలువులు మనకే’నన్న నినాదం సాకారమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. పోలీసు శాఖలో ఒకేసారి 16 వేల పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీకాగానే యువతలో ఆనందోత్సాహాలు రెట్టించాయి. పోలీస్ శాఖలో పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న వారు మరింత ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నారు. కొలువులే లక్ష్యంగా కష్టపడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 81వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ కొలువుల ప్రకటనతో ఈ ప్రక్రియ ముమ్మరమైంది. మిగిలిన శాఖల్లో పోస్టుల భర్తీపై వరుస నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. గ్రూప్-1తో పాటు అన్ని రకాల పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు రానున్నాయి. పోలీస్ కొలువుల కోసం ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ శాఖలో పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండడంతో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు ఒకేసారి ప్రిపేర్ అవుతున్నారు.
కచ్చితంగా కొలువు కొట్టే లక్ష్యంతో కష్టపడుతున్నారు. పోలీస్ ఉద్యోగాల రాత పరీక్ష, ప్రిపరేషన్ అంశాలు మిగిలిన పోస్టులకూ ఉపయోగపడుతాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఇప్పటికే 1.31 లక్షల పోస్టులు భర్తీ అయ్యాయి. మరో 81 వేల పోస్టుల భర్తీకి వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు నుంచి రాష్ట్ర సర్కారు పోలీసు శాఖలో 31,972 పోస్టులు భర్తీ చేసింది. తాజాగా మరోసారి 16,614 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మే 2నుంచి 20వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా అభ్యర్థుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది.
బయ్యారం : గతంలో రెండు సార్లు పోలీ స్ జాబ్ కోసం ప్రయత్నిం చాను. కొద్ది మా ర్కుల తేడా జాబ్ మిస్సయింది. మళ్లీ నోటిఫి కేషన్ ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నా. ఈ సమయంలోనే సీఎం కేసీఆర్ సార్ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకటించడం తో ఎంతో సంబురపడ్డా. మళ్లీ అవకాశం వచ్చినందుకు ఆనం దంగా ఉంది. ఈసారి ఎలాగైనా పోలీస్ ఉద్యోగం సాధిస్తా. నిరుద్యోగులకు పెద్దసంఖ్యలో కొలువులు కల్పించా లని ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోంది. నాలాంటి యువత ప్రభుత్వ నిర్ణయంతో సంతృప్తిగా ఉన్నారు.
– షేక్ సమీర్, బయ్యారం
జనగామ చౌరస్తా : మాది జనగామ పట్టణంలోని కుర్మవాడ. నేను 2015లో డిగ్రీ పూర్తి చేశాను. రెండు సంవత్సరాల నుంచి పోలీసు ఉద్యోగంలో చేరాలని చాలా కష్టపడు తున్నా. గత డిసెంబర్, జనవరి నెలల్లో జనగా మ అర్బన్ పోలీసులు ఇచ్చిన ఉచిత పోలీసు శిక్షణకు కూడా హాజరయ్యాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇక ఎస్సై కొలువు సాధించడమే నాముందున్న ఏకైక లక్ష్యం. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది.
– నోముల అనిల్, జనగామ
గోవిందరావుపేట : పోలీస్ శాఖలో ఎస్సై పోస్టు సాధించాలన్నదే నా కోరిక. ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకలవ్య పోలీస్ శిక్షణకు కూ డా ఎంపికయ్యారు. ప్రభుత్వం పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఇక నా కల నెరవేరే సమయం వచ్చింది. శిక్షణ పూర్తి చేసుకొని ఉద్యోగం సాధిస్తా. నా మైండ్‌లో ఉద్యోగం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతా. శిక్షణలో ఎంతటి కష్టాన్ని అయినా భరించి ఉద్యోగం సాధిస్తా.
– జంపాల కావ్య, గోవిందరావుపేట
హనుమకొండ చౌరస్తా : పోలీస్ కావడానికి మానసికంగా, శారీరక దృఢత్వం ఎంతో అవసరం. అందుకే ప్రతి రోజూ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. నెల రోజులుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటన చేసిందని తెలిసి చాలా సంతోషపడ్డా. ఈసారి ఎలాగైనా జాబ్ సాధించి నా గురువులకు గిఫ్ట్ ఇస్తా.
– ఎం సాయితేజ, ఎస్సై అభ్యర్థి
భూపాలపల్లి టౌన్ : చాలా కాలం తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఐ కావాలనే నా కల ఇక సాకా రం చేసుకుంటా. నేను బీటెక్ పూర్తి చేశాను. అప్పటినుంచి ఎదురుచూస్తున్నా. ఒకవైపు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా. సీఎం కేసీఆర్ పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటా. ఉద్యోగం సాధించి తీరుతా.
– నూనె సుప్రియ, భూపాలపల్లి
తెలంగాణ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఎక్కువ పోస్టులతో నోటిఫి కేషన్ వేయడం సంతోషం. కష్టపడి చదివి కచ్చితంగ ఉద్యోగం కొడ్త. ఇప్పటికే చల్లా చారిట్రబుల్ ట్రస్టు ద్వారా శిక్షణ తీసుకుంటున్న. ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుంట. పెద్ద మొత్తంల ఉద్యోగాలు నింపడం వల్ల ఎక్కువ మందికి ఉపాధి దొరకుతది. ఈ శిక్షణలో నాతోపాటు చాలా మంది నిరుద్యోగులు పోలీసు ఉద్యోగం సాధిస్తరు.
– మంద సృజన్, అనంతారం, గీసుగొండ