జిల్లాకు రెండు జాతీయ పురస్కారాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వం శనివారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తీ కరణ్ పురస్కార్-2021 పేరుతో అవార్డులను ప్రకటించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడేళ్లలో చేపట్టిన ప్రగతి నివేదికలు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమంలో చేట్టిన పనుల ద్వారా గ్రామపంచాయతీ కేటగిరీలో గీసుగొండ మండలం మరియపురం, మండల కేటగిరీలో పర్వతగిరి మండలం ఎంపికయ్యాయి. దీంతో ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గీసుగొండ, ఏప్రిల్ 10: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దీన్‌దయాళ్ పంచాయత్ సశక్తీకరణ్-2021 పేరిట కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఇందులో మరియపురం గ్రామ పంచాయతీ సాధించిన ప్రగతికి.. దీన్‌దయాళ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కారం అందుకొని జాతీయ స్థాయిలో ఉత్తమ జీపీగా విజయం సాధించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అంశాలపై శనివారం ఉత్తమ జీపీల ఎంపిక చేపట్టారు. ఇందులో మరియపురం గ్రామ పంచాయతీ పారిశుధ్యం, రెవెన్యూ జనరేషన్, ఈ-పంచాయతీ, కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఈ-గవర్నర్స్‌పై గ్రామం సాధించిన ప్రగతి నివేదికలను సమర్పించి రాష్ట్ర, దేశస్థాయిలో పుస్కారాలకు పోటీ పడింది.
దీంతోపాటు జనరల్ అంశాల్లో కూడా గ్రామం జాతీయస్థాయిలో పోటీలో నిలిచింది. మరియపురం సాధించిన ప్రగతిని గుర్తించి జాతీయ ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేశారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి, జీపీ సమావేశాల నిర్వహణ, పంచాయతీ ఆదాయం పెంపు, రికార్డుల నిర్వహణ, శుద్ధిచేసిన తాగునీటి సరఫరా, వందశాతం మరుగదొడ్ల వాడకం, వందశాతం ఇంకుడు గుంతలు, వంద శాతం అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, బాలకార్మికులు లేని గ్రామంగా అవతరించింది. గ్రామంలో అంతర్గత రోడ్లు, రహదారులకు ఇరువైపులా పచ్చని చెట్లు, పచ్చదనం పరిశుభ్రత, గ్రామంలో ఎల్ఈడీ వీధిదీపాలు, గ్రామస్తుల సహకారంతో ప్లాస్టిక్ నిషేధంలో సాధించిన ప్రగతితోపాటు పంచాయతీ నిర్వహణలో అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని పరిగణలోకి తీసుకొని జనరల్ అంశాల్లో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపికైంది.
పర్వతగిరి: మండలం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తూ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. దీంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్(డీడీయూపీఎస్‌పీ)కు ఉత్తమ మండలంగా ఎంపికైంది. ఆరు నెలల క్రితమే 34 అంశాలతో కూడిన ప్రశ్నావళిని పూరించి జాతీయస్థాయి అవార్డుకు దరఖాస్తు చేశారు. దీంతోపాటు అదనంగా తొమ్మిది విభాగాలకు సంబంధించి గ్రామాల్లో అమలు చేస్తున్న శానిటేషన్ పనులు, పౌరసేవలైన తాగునీరు, వీధిదీపాలు, వసతుల కల్పన, సహజ వనరులు పెంపొందించేలా ఉపాధిహామీ పనుల్లో ప్రతిభ కనబర్చడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల అభ్యున్నతికి రుణాలు, పింఛన్లు అందించడంలో మండలంలోని అన్ని గ్రామాలు ముందంజలో ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా కరోనా సమయంలో ప్రజలకు మేలు జరిగేలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలుకు యువత ప్రాతినిథ్యం వహించేలాగా యూత్‌ను ప్రోత్సహించే విధంగా ప్రతినెలా గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో జీపీల ఆదాయ మార్గాలు పెంపొందించడం కోసం అనేక విధాలుగా అధికారులు ప్రోత్సాహకాలు అందించడంతోపాటుగా తడి, పొడి చెత్తతో ఆదాయం సంపాదించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామాల్లో కరోనా సమయంలో జీపీ కార్యదర్శులతో పనులు సమర్థవంతంగా చేపట్టేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేశారు.
ఎంపీటీసీలతో స్థాయీ సంఘాలు ఏర్పాటు చేసి వాటి అమలు తీరుపై నిత్యం సమీక్షలు చేపట్టి విజయవంతం చేశారు. సమావేశాల్లో మినిట్స్ బుక్‌ల నిర్వహణను చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో తీసుకుంటున్న చర్యలు విజయవంతంగా అవుతున్నాయి.
ముందస్తుగా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం సంవత్సర ప్రణాళికలు ఏర్పాటు చేసి అమలు చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. గ్రామ పంచాయతీలకు నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామాల్లో ప్రజలకు విద్యుత్, తాగునీరు, వసతుల కల్పనలో తీసుకున్న చర్యలు, జీపీ రికార్డుల తనిఖీ, ఆడిటింగ్ విధానం, రికార్డులు ఆన్లైన్ చేయడం, జీపీలకు రెవెన్యూ పెంచుకోవడానికి తీసుకున్న ఏర్పాట్లు మేలు కలిగేలా ఉన్నాయి.
పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే విధానం, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సేవలు, సరైన సమయంలో సమాచారాన్ని ప్రజలకు ఏవిధంగా చేరవేస్తున్నారనే విషయాల్లో పర్వతగిరి మండల అధికారులు చూపి న చొరవ, ప్రణాళికలకు ఈ అవార్డు వరించిందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. గ్రామస్తులు, అధికారులు, పాలకుల సహకారంతో ప్రభుత్వ నిధులను వినియోగించుకొని గ్రామానికి ఉన్న అవసరాలను గుర్తించి ఒక్కో సమస్యను పరిష్కరించుకొంటూ ముందుకెళ్లాం. దీంతో మూడేళ్లలో గ్రామం అద్భుతంగా తయారైంది. ఇందులో గ్రామస్తుల భాగస్వామ్యం ఎంతో ఉంది. మా గ్రామం ఈ అవార్డుకు ఎంపిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– అల్లం బాలిరెడ్డి, సర్పంచ్, మరియపురం
పర్వతగిరి మండలంలో పేదరిక నిర్మూలన, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు సమన్యయంతో ముందుకెళ్లడంతో జాతీయస్థాయి అవార్డు వచ్చింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులను సమర్థవంతంగా చేపట్టడం వల్లే అవార్డుకు ఎంపికైంది. శానిటేషన్, డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలను సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించారు. డంపింగ్ యార్డుల్లో వర్మీకంపోస్టు ఎరువు తయారీతో ఆదాయ వనరులు పెంపొంది గ్రామాలన్నీ ఆదర్శంగా మారాయి. ప్రజాసమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నాం.
– చక్రాల సంతోష్‌కుమార్, ఎంపీడీవో