57 ఏండ్లు నిండిన వారికి పింఛన్
రేపటి వరకు దరఖాస్తుకు అవకాశం
మీ సేవ, ఈ సేవ కేంద్రాల వద్ద వృద్ధుల బారులు
ఇప్పటికే వనపర్తి జిల్లాలో 65,621 మందికి..
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లతో మరింత మందికి ఆసరా కలుగనున్నది. 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు పింఛన్ అర్హత వయస్సు కుదించింది. ఈ వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందనున్నది. ఇందుకోసం ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నది. దీంతో ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు బారులుదీరుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పర్యవేక్షణ జరుగుతుండగా.. గడువు ముగిశాక అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాలో 65,621 మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా.. త్వరలో మరింత మందికి లబ్ధిచేకూరనున్నది.
వనపర్తి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్ర భుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగానే మరికొంత మందికి ఆసరా పిం ఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల వయస్సును 57 ఏండ్లకు సడలించింది. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. ఈ సేవ, మీ సేవలో ఉచితంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. వయసు నిర్ధారణ పత్రం తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పొందిన బర్త్ సర్టిఫికెట్, చదువుకున్న వారైతే విద్యార్హత సర్టిఫికెట్లు, ఓటరు ఐడీ కార్డు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి మానిటరింగ్ ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిశాక అర్హులను ఎంపిక చేసి పింఛన్లు అందజేయనున్నారు. కాగా, మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండడంతో దరఖాస్తుదారులు మీ సేవ, ఈ సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
వనపర్తి జిల్లాలో ప్రతినెలా 65,621 మందికి పింఛన్లు అందుతున్నాయి. ఇందులో 23,704 వృద్ధాప్య పింఛన్లు, 10,910 దివ్యాంగులు, 26,395 మంది వితంతువులు, 661 మంది చేనేత కార్మికులు, 2,533 మంది ఒంటరి మహిళలు, 988 మంది బీడీ కార్మికులు, 424 మంది గీతా కార్మికులు, ఫైలేరియా బాధితులు ఆరుగురు ఉన్నారు. వీరికి నెలనెలా ప్రభుత్వం రూ.14.88 కోట్లు ఖర్చుచేస్తున్నది. కాగా, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును కుదించింది. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్న ది. కొత్తగా దరఖాస్తు చేసుకు నే వారే కాకుండా గతంలోనే 4,758 మందిని జిల్లా యంత్రాంగం అర్హులుగా గుర్తించింది.